Bandla Krishna Mohan Reddy: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించిన హైకోర్ట్‌..

ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారనే అభియోగంలో కృష్ణమోషన్‌ రెడ్డి ఎన్నికను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఆయన తరువాత స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.

  • Written By:
  • Updated On - August 24, 2023 / 04:32 PM IST

Bandla Krishna Mohan Reddy: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేగా అర్హత విషయంలో వరుసగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొన్నామధ్య చెన్నమనేని రమేష్‌, రీసెంట్‌గా వనమా వెంకటేశ్వర్‌ రావు, ఇవాళ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోషన్‌ రెడ్డి.. ఇలా వరుసగా ఎమ్మెల్యేలకు న్యాయస్థానాల్లో చుక్కెదురవుతోంది. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారనే అభియోగంలో కృష్ణమోషన్‌ రెడ్డి ఎన్నికను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు.

ఆయన తరువాత స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇండియన్‌ సిటిజెన్‌షిప్‌ విషయంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నారు. ఆయన జర్మన్‌ సిటిజెన్‌ అని, ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన గెలుపు చెల్లదంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ వ్యవహారం చాలా రోజుల నుంచి పెండింగ్‌లోనే ఉన్నా.. చెన్నమనేని కేసు గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ కారణంగానే ఈసారి ఎన్నకల్లో ఆయనకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ కూడా కేటాయించలేదు. ఇక రీసెంట్‌గా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌ రావు మీద కూడా అభియోగం దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చాడంటూ వనమాకు వ్యతిరేకంగా జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు వనమా ఎన్నికను రద్దు చేసింది. కానీ వనమా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పుడు బండ్ల కృష్ణమోషన్‌ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కృష్ణమోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్ట్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్‌ కృష్ణమోహన్‌ రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్‌ చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఏది ఏమైనా ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఇలా అనర్హత వేటు పడటం బీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్ద మైనస్‌.