Vanama Venkateswara Rao: వనమాకు షాకిచ్చిన హైకోర్టు.. అసెంబ్లీ సభ్యత్వం రద్దు.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం

2018లో వనమా వేంకటేశ్వర రావు కాంగ్రెస్ తరఫున కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 12:27 PM IST

Vanama Venkateswara Rao: కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న వనమా వేంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు నివేదిక సమర్పించిన కారణంగా ఎమ్మెల్యేగా వనమా ఎంపికను హైకోర్టు రద్దు చేసింది. వనమా తర్వాతి స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది.

2018లో వనమా వేంకటేశ్వర రావు కాంగ్రెస్ తరఫున కొత్తగూడెం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. వనమా తర్వాతి స్థానంలో జలగం నిలిచారు. అయితే, వనమా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులున్నాయని గ్రహించిన జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కారణంగా వనమా ఎన్నిక రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వనమా.. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించినట్లు గుర్తించింది. సమగ్ర విచారణ జరిపిన అనంతరం వనమా వేంకటేశ్వరావు ఎన్నిక చెల్లదని తాజాగా తీర్పునిచ్చింది.

2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా అర్హుడు కాదని సంచలన తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యేగా వనమా సభ్యత్వాన్ని రద్దు చేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగాను రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా స్థానంలో జలగంను నియమించింది. వనమా తర్వాతి స్థానంలో జలగం ఉండటంతో ఆయనను ఎమ్మెల్యేగా ఎంపిక చేసింది. ఈ తీర్పుపై వనమా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారేమో చూడాలి.