Avinash – CBI: అవినాశ్ అరెస్టుపై సీబీఐ ముందరికాళ్లకు బంధం..!!

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై రెండ్రోజులపాటు విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పును 31న వెల్లడిస్తామని చెప్పింది. అప్పటివరకూ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో సీబీఐ మరోసారి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 03:21 PM IST

అవినాశ్ అరెస్ట్ ఎపిసోడ్ కు ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా లేదు. పిల్లీ ఎలుకా కథ లాగా ఈ ట్విస్టులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అవినాశ్ ను అరెస్టు చేయాలని సీబీఐ, మరికొన్నాళ్లు టైం ఇవ్వండని కోర్టులు చెప్తుండడంతో ఈ కథకు ముగింపు ఎప్పుడో అర్థం కావట్లేదు. ఈ కేసును క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి డెడ్ లైన్ పెట్టింది. అయితే నిందితులను ఇప్పటివరకూ పూర్తిగా విచారించనేలేదు సీబీఐ. అవినాశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం డీటెయిల్స్ బయటికొస్తాయని సీబీఐ భావిస్తోంది. అయితే ఇవాళ కూడా తెలంగాణ హైకోర్టులో అవినాశ్ కు ఊరట లభించింది. దీంతో అవినాశ్ అరెస్ట్ కు బ్రేక్ పడింది.

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ప్రస్తుతం అవినాశ్ రెడ్డి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అవినాశ్ రెడ్డిని కూడా పలుమార్లు విచారించింది. అయితే తదుపరి విచారణలో అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి బెయిల్ పిటిషన్లపై విచారణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు నుంచి మళ్లీ హైకోర్టుకు.. ఇలా చక్కర్లు కొడుతూనే ఉంది. దీంతో సీబీఐ ఏం చేయలేక కోర్టు ఆదేశాలకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.

ఇదే సమయంలో అవినాశ్ రెడ్డి తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమె కర్నూలు ఆసుపత్రిలో చేరారు. అక్కడికెళ్లి అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాలని సీబీఐ ట్రై చేసింది. అయితే ఆసుపత్రి చుట్టూ వైసీపీ నేతలు, అవినాశ్ రెడ్డి అనుచరులు కాపలాకాశారు. దీంతో లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. పైగా అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని వైసీపీ నేతలు హెచ్చరించారు. దీంతో సీబీఐ అడుగు ముందుకు వేయలేకపోయింది. ఈలోపే అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టుకు, అటు నుంచి హైకోర్టుకు వచ్చింది.

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై రెండ్రోజులపాటు విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పును 31న వెల్లడిస్తామని చెప్పింది. అప్పటివరకూ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో సీబీఐ మరోసారి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించట్లేదని, ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే తమకు మరిన్ని ఆధారాలు లభిస్తాయని పేర్కొంది. వివేకా హత్య జరిగిన రోజు నిందితులంతా అవినాశ్ రెడ్డితో టచ్ లో ఉన్నారని, పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే హత్య విషయం అవినాశ్ తో పాటు జగన్ కు కూడా తెలుసని అఫిడవిట్లో తెలిపింది. అయితే వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత అవినాశ్ రెడ్డి తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో… మూడు రోజులపాటు గడువు ఇవ్వాలని సీబీఐకి సూచించింది హైకోర్టు. 31న తుది తీర్పు వస్తే ఆ తర్వాత సీబీఐ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.