ఈ ప్రశ్నకు బదులేది, కేటీఆర్ , నాగార్జున ,సమంత ,చైతన్య

తెలంగాణ మంత్రి కొండ సురేఖ.. కేటీఆర్ పై చేసిన ఆరోపణ దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండాలంటే, హీరోయిన్ సమంతనీ తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు కొండ సురేఖ ఆరోపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 12:47 PM IST

తెలంగాణ మంత్రి కొండ సురేఖ.. కేటీఆర్ పై చేసిన ఆరోపణ దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయకుండా ఉండాలంటే, హీరోయిన్ సమంతనీ తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేసినట్లు కొండ సురేఖ ఆరోపిస్తున్నారు. సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని నాగార్జున ,నాగ చైతన్య ఒత్తిడి చేసినప్పటికీ సమంత పోలేదని.. ఆ గొడవ వల్లే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారని కొండ సురేఖ చెప్తున్నారు. అయితే కొండా సురేఖ చేసిన ఈ ఆరోపణను సినిమా ఇండస్ట్రీ తో పాటు సామాన్య జనం కూడా తీవ్రంగా ఖండించారు. మహిళపై ఇలాంటి ఆరోపణలు తగవని నిరసిస్తూ అక్కినేని కుటుంబానికి అండగా నిలబడ్డారు అందరూ. కొండ సురేఖ కేటీఆర్నీ టార్గెట్ చేస్తూ పేల్చిన బాంబులు సమంతకు, నాగార్జునకు తగిలాయి. కానీ అసలు ఈ ఆరోపణలకు ఆస్కారం ఇచ్చింది ఎవరు? దీని వెనక ఏం జరిగింది? సురేఖ ఆరోపణలు అబద్ధమే కావచ్చు… కానీ ఆరోపణలకు మూల కారణాలేంటి, వాటిని జనంలో కొందరు నమ్మడానికి ఆధారాలు ఏంటి అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. జనం వేసే ప్రశ్నలకు నాగార్జున నుంచి గాని, కేటీఆర్ నుంచి గాని, సమంత నుంచి గాని సమాధానం లేదు.

కొండా సురేఖ ఆరోపణ కచ్చితంగా అబద్ధమే కావచ్చు. ఆ ఆరోపణకు ఆస్కారం ఇస్తున్న కొన్ని సంఘటనలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకలేదు.2014 నుంచి 2023 డిసెంబర్ వరకు టిఆర్ఎస్ పాలనలో కేటీఆర్ సినిమా ఇండస్ట్రీ తో రాసుకొని పూసుకొని తిరిగారు. బహుశా సినిమా వాళ్లంటే ఉన్న ఆకర్షణ కావచ్చు. ఆ ఇండస్ట్రీ ని అదుపులో పెట్టుకుంటే ఉపయోగపడతారని ఆశ కావచ్చు. అదే జోష్ లో సమంతకు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇచ్చి రెండు కోట్ల రూపాయలు గౌరవ పారితోషికం కూడా ఇచ్చారు కేటీఆర్. ఇక్కడే సమస్యకు బీజం పడింది. సమంత రూత్ ప్రభు తమిళనాడు కి చెందిన క్రిస్టియన్ మహిళ. తల్లి మలయాళీ. తండ్రి ఆంగ్లో ఇండియన్. చెన్నైకి దగ్గరలోని పల్లవరం సమంత సొంతూరు. తెలుగు తో పాటు అన్ని భాషల చిత్రాల్లోనూ ఆమె నటించింది. సమంత తెలంగాణ మహిళ కాదు. తెలంగాణ చేనేత తో ఆమెకు ఏ సంబంధం లేదు. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడానికి కెసిఆర్ ప్రభుత్వానికి నాలుగు కోట్ల తెలంగాణ జనంలో ఒక్క మహిళ దొరకలేదా? ఇదే పని తమిళనాడు ప్రభుత్వం చేస్తుందా? ఒక తెలంగాణ మహిళ ను తీసుకెళ్లి తమిళనాడు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయగలరా? బలమైన ప్రాంతీయవాదంతో, తెలంగాణ ఉనికి లక్ష్యంతో ఉద్యమం చేసిన టిఆర్ఎస్ ,తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఒక తమిళ యువతిని ఎన్నుకోవడమే చాలా సందేహాలకు తావిచ్చింది. తెలంగాణ చేనేత నానాటికి కునారిల్లిపోతుంది. చేనేత కార్మికులు తిండికి లేక ఆకలి చావులు చేస్తున్నారు. జనానికి ఒంటినిండా గుడ్డ ఇచ్చే చేనేత కార్మికులు కడుపులో గంజి లేక అల్లాడిపోతున్నారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంతకు ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు ఇచ్చి ఉంటే ఎన్నో కుటుంబాలు బాగుపడేవి. వాళ్ళ ఆకలి తీర్చినట్లు అయ్యేది. వాళ్ల సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం దొరికేది. అది వదిలేసి తెలంగాణ చేనేతకు, తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేని సినిమా హీరోయిన్ ని తీసుకొచ్చి రెండు కోట్ల రూపాయలు అప్పజెప్పడం తప్పు కాదా? మోడరన్ డ్రెస్సులు, పంజాబీ డ్రెస్సులు వేసుకునే సమంతకు చేనేత తో సంబంధం ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వం తరఫున ఆరోజు కేటీఆర్ ఇచ్చిన రెండు కోట్లు సమంతా వెనక్కి ఇచ్చి ఉండాల్సింది. అంతేకాదు నాగార్జున కూడా కేటీఆర్ కి హితువు చెప్పి, సమంత చేత డబ్బు వెనక్కి ఇప్పించి ఉండాల్సింది. ఆకలి చావులతో అల్లాడిపోతున్న నేత కార్మికుల సొమ్ము మనకెందుకు అని నాగార్జున పెద్దమనిషిగా సమంతకు కాస్త గడ్డిపెట్టి ఆ డబ్బు వెనక్కి పంపించాల్సింది. అది చేయలేదు. అసలు సమంతను తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు చేశారు అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ లేదు.

ఇక ఎన్ కన్వెన్షన్ విషయానికొద్దాం. హైదరాబాద్ మాదాపూర్ లో తుమ్మిడి కుంట చెరువులో మూడు ఎకరాలకు పైగా భూమిని నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణంలో భాగంగా ఆక్రమించారనేది అందరికీ తెలుసు. ఎన్ కన్వెన్షన్ లో మూడు ఎకరాల స్థలం తుమ్మిడి కుంటలోనిదేనని రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఎన్ కన్వెన్షన్ నీ కూల్చివేయడానికి కెసిఆర్ సర్కార్ ఓసారి ప్రయత్నం చేసి అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ లాగా అప్పుడు ఎందుకు ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేయలేదు? ఎవరు అడ్డుపడ్డారు? ఏ శక్తి ఎం కన్వెన్షన్ ను కూల్చివేయకుండా అడ్డుపడింది? ఇప్పుడు లేని అడ్డంకులు అప్పుడు ఎందుకు వచ్చాయి? ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడానికి పొక్లనర్లు ముందుకు వెళ్లి ,మళ్లీ వెనక్కి ఎందుకు వచ్చాయి?జస్ట్ కోర్ట్ స్టే ఆర్డర్ చూపించి తెలివిగా ఎన్ కన్వెన్షన్ ను ఇన్నాళ్లు ఎలా కొనసాగించారు? దీనికి ఎవరు అనుమతిచ్చారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చకుండా నిలిపివేయడానికి భారీగా డబ్బు ఇచ్చారా..? లేక ఇంకేమైనా ఆశగా చూపారా? అనేది ఇప్పటికీ తేలలేదు. రేవంత్ కి సాధ్యమైన పని 8 ఏళ్ల క్రితం కేటీఆర్ కు ఎందుకు సాధ్యం కాలేదు? కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ ను ఎందుకు కూల్చి వేయలేదు ? ఎవరు అడ్డం పడ్డారు? ఎవరు ఆశ చూపారు అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. కొండా సురేఖ ఆరోపణల ను సమర్థించాలని కానీ, సమంతను కించపరచాలని గాని, నాగార్జున, నాగచైతన్యలను తప్పు పట్టాలని గాని ఉద్దేశం కాదు. కానీ ఓవరాల్ ఎపిసోడ్లో కేటీఆర్ వ్యవహరించిన తీరే అన్ని అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణతో సంబంధం లేని, తమిళనాడుకు చెందిన సమంతను తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు చేశారు? ఆరోజు ఎన్ కన్వెన్షన్ ను ఎందుకు కూల్చి వేయలేదు ఈ రెండు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇవ్వగలిగితే…. ఇంత వివాదం ఉండనే ఉండదు.