KTR: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ ‘ఆంధ్రాకార్డు’ వేడి రాచుకుంది. అందుకే కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆంధ్రా నాయకుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘ఆంధ్రా నాయకులు తెలంగాణలోకి ఎంటర్ కావడానికి యత్నిస్తున్నారు’’ అనే సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని దెబ్బతీయడానికి ఆంధ్రా నాయకులను రంగంలోకి దింపుతున్నాయి’’ అని కేటీఆర్ తాజాగా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల అంతరార్ధం, పరమార్ధం ఒక్కటే.. తెలంగాణ ఎమోషన్‌ను క్రియేట్ చేయడం!!
రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీలలో ఆంధ్రా నాయకులు పాగా వేస్తున్నారనే అంశాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉందనే విషయం కేటీఆర్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. బీఆర్ఎస్ ఒక్కటే ప్యూర్ తెలంగాణ పార్టీ అని చెప్పకనే చెబుతున్నారు కేటీఆర్. ఒకవేళ అదే నిజమైతే.. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్, ప్రాంతీయ ఎజెండాతో ముందుకుపోవడం కరెక్ట్ అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇష్టానుసారంగా ఆంధ్రాకార్డును ప్రయోగించాలని బీఆర్ఎస్ భావిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ శాఖ వికాసానికి ఆదిలోనే ఫుల్‌స్టాప్ పడినా ఆశ్చర్యం ఉండదు. అందుకే జాతీయ పార్టీగా ఎదగాలని భావిస్తే బీఆర్ఎస్ ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఉంది. దీనికి రెండు రోజులు ముందు.. అంటే ఈ నెల 15నే షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వస్తున్నాయి. షర్మిలకు సపోర్ట్‌గా ఉండేందుకు కేవీపీ రామచంద్రరావు కూడా హైదరాబాద్ పాలిటిక్స్‌లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారట. ఆ దిశగా సంకేతాలిచ్చే పలు కామెంట్స్‌ను ఆయన ఇటీవల చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో బీజేపీ విస్తరణ కోసం వ్యూహాలను రెడీ చేసి అందిస్తున్నారు. వీరందరినీ బీఆర్ఎస్ నేతలు ఆంధ్రా కార్డుతో పొలిటికల్‌గా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మళ్లీ ఏపీ నేతలు తెలంగాణపై పట్టు సాధించేందుకు క్యూ కట్టి వస్తున్నారనే సందేశాన్ని తెలంగాణ ప్రజల్లోకి పంపే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరితే.. రాష్ట్రంలోని రెడ్డి, దళిత ఓటు బ్యాంకు హస్తం పార్టీ వైపు మొగ్గుచూపుతారనే ఆందోళన కారు పార్టీ అధినాయకత్వంలో ఉంది. ఆమె రాకతో రెడ్డి వర్గం, దళిత ఓటుబ్యాంకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పదేళ్లుగా తెలంగాణలో బలంగా పాతుకుపోయిన బీఆర్ఎస్‌ను అధికారం నుంచి గద్దె దింపడం అంత ఈజీ కాదు. ఈ విషయాన్ని గుర్తెరిగి విపక్ష పార్టీలు నడుచుకోవాలి. విపక్షాలు ఏ చిన్న తప్పటడుగు వేసినా.. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఓట్లుగా మల్చుకునే ఛాన్స్ ఉంటుంది. వాస్తవానికి దేశంలో ఎక్కడైనా రాజకీయాలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. బ్రిటన్ ప్రధానిగా భారతీయుడు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా భారతీయురాలు అయినప్పుడు తెలంగాణలో కీలక పదవులను అందుకునే స్థాయికి ఆంధ్రామూలాలు ఉన్న నాయకులు ఎందుకు కాకూడదు..? ఇలాంటి విశాల ఆలోచనా వైఖరితో బీఆర్ఎస్ ముందుకు సాగితేనే జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు అందుకుంటుంది. లేదంటే ఆ లక్ష్యం అసాధ్యంగా మిగిలిపోతుంది.