REVANTH REDDY: రేవంత్ రెడ్డిపై అలిగిన మంత్రులు.. కారణం అదే!

తెలంగాణలో 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ గుట్టు చప్పుడు కాకుండా లిస్ట్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే అధికారిక ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. మార్చి 14న లిస్ట్ రిలీజ్ అయినా.. 16 రాత్రి వరకూ బయట పెట్టలేదు

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 06:45 PM IST

REVANTH REDDY: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రులు, కొందరు పార్టీ సీనియర్ నేతలు అలిగారు. తమకు చెప్పకుండా.. కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించడమే ఇందుక్కారణం. ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా కార్పొరేషన్ పదవులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలాంటి పదవులు ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు మాత్రం.. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా తమ జిల్లాల్లో పదవులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ గుట్టు చప్పుడు కాకుండా లిస్ట్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే అధికారిక ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు.

GVL Narasimha Rao: జీవీఎల్ దారెటు.. జీవీఎల్‌ మీద కసి తీర్చుకున్న చంద్రబాబు!

మార్చి 14న లిస్ట్ రిలీజ్ అయినా.. 16 రాత్రి వరకూ బయట పెట్టలేదు. ఎన్నికల కోడ్ రావడంతో జీవోలు విడుదల చేయలేదని తెలిసింది. తాము సూచించిన నేతలకు పదవులు ఇవ్వలేదని కొందరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిపై నారాజ్‌గా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో పోస్టుల భర్తీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహంగా ఉన్నారు. మంత్రి శీధర్ బాబు మనుషులకే పోస్టులు దక్కాయంటున్నారు. రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీకి కాల్ చేసి.. పొన్నం తన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నామినేటెడ్ పదవులపై అసంతృప్తిగా ఉన్నారు. తన శాఖ పరిధిలో భర్తీ చేసే పోస్టులు కూడా తనకు తెలియలేదన్నారు. IDC కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొల్లాపూర్‌కు చెందిన జగదీశ్వర్ రావును నియమించడంపై ఉత్తమ్ కోపంగా ఉన్నారు. మరో సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కూడా కార్పొరేషన్ పదవుల పందేరంపై అసంతృప్తిగా ఉన్నారు. తాను గతంలో ఎంపీగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులపై తనకు మాట వరుసగా కూడా చెప్పలేదంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మైనారిటీ పోస్టుల భర్తీపై ఆ వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు.

MIMతో పోరాడే వాళ్ళని పట్టించుకోకుండా వేరే వాళ్ళకి పదవులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం భర్తీ చేసిన 37 పోస్టుల్లో రెడ్డి సామాజిక వర్గానికి 13 పదవులు దక్కాయి. దాంతో మిగతా వర్గాల వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన వారికి ప్రాధాన్యం దక్కలేదంటున్నారు. అలాగే కొందరు ఈ నామినేటెడ్ పదవుల్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంపీ టిక్కెట్ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనుకుంటే కార్పొరేషన్ పదవితో సరిపెట్టడమేంటని కొందరు కోపంగా ఉన్నారు. జిల్లాల్లో మంత్రులు తమ అనుచరులకు పోస్టులు ఇప్పించుకుంటే.. ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల్లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే.. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ మంత్రులు, నేతలమధ్య మనస్పర్థలకు కారణమయ్యాయి.