కొందరు నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారు. పదవులను గడ్డి పోచల్లా భావిస్తారు. ప్రజల ఆకాంక్షలనే పరమావధిగా పరిగణిస్తారు. అలాంటి వారిలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…అగ్రస్థానంలో ఉంటారు. గెలుపోటములను లెక్కలోకి తీసుకోకుండా పని చేస్తున్న అసలసిసలైన నేత పొన్నం ప్రభాకర్. తెలంగాణ కోసం ఎంపీ పదవికే రాజీనామా చేసిన ప్రజా నాయకుడు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్న రోజుల్లోనే…ఉద్యమం కోసం గొంతెత్తాడు. పొన్నం ప్రభాకర్ ప్రతిభను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి…పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. కరీంనగర్ లోక్ సభకు పోటీ చేయాలని ఆదేశించారు. ఎంతో మంది కరీంనగర్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే…పొన్నం ప్రభాకర్ వెతుక్కుంటూ వచ్చింది సీటు. అది కూడా హేమాహేమీలున్న కాంగ్రెస్ పార్టీలో. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ…వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొన్నంనే బరిలోకి దించారు. హస్తం పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పై 52వేల ఓట్లతో గెలుపొంది…తొలిసారి పార్లమెంట్ అడుగు పెట్టారు. తెలంగాణ ప్రాంతం నుంచి 15వ లోక్‌సభ ఎన్నికైన వారిలో పొన్నం ప్రభాకర్…అతి పిన్న వయస్కుడు. ఆ తర్వాత రైల్వే, విద్యుత్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. రసాయనాలు, ఎరువులు, కంప్యూటర్లపై జాతీయ కమిటీలలోనూ పని చేశారు.
తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలోనే…ప్రత్యేక రాష్ట్రం కోసం గొంతెత్తాడు. సీనియర్ ఎంపీలంతా భయపడుతున్న వేళ…పొన్నం ప్రభాకర్ వెనుకంజ వేయలేదు. కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటూ…అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించారు. ఒకానొక దశలో పార్టీ హైమాండ్ ఆగ్రహానికి గురయినా…నమ్ముకున్న పోరాటంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరాల్సిందేనని హస్తం పార్టీలోని ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చాడు. 2010లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజుల్లో…ఎంపీ పదవీకి రాజీనామా చేశారు. లోక్ సభకు ఎన్నికైన ఏడాదికే రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలే షాకయ్యారు. పొన్నంకు ఏమైనా పిచ్చా అంటూ కామెంట్లు చేశారు. వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడని విమర్శలు చేశారు. ఎవరేమన్నా తాను అనుకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడు. లోక్ సభ ఎంపీల ఫోరమ్ అధ్యక్ష పదవిని వదులుకున్నారు.
తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో ఎప్పుడూ ముందున్నారు. పార్టీ, సిద్ధాంతాలకు అతీతంగా…ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ‘ధూమ్ ధామ్’, ‘వంట వార్పు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎదిరించిన ఏకైక వ్యక్తి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటనకు రెడీ అయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని కరీంనగర్ జిల్లాలోకి రానివ్వబోమని పొన్నం శపథం చేశారు. సీఎం నిర్ణయాన్ని పొన్నం తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. జిల్లాలో అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. కరీంనగర్ లో పర్యటిస్తే…ఆందోళనకారులను రెచ్చగొట్టినట్లేనని స్పష్టం చేశారు. ఒకానొక దశలో కిరణ్‌కుమార్‌రెడ్డిని…నేను చెప్పేది పట్టించుకోకపోతే మీరు ప్రయాణించే హెలికాప్టర్‌ను పేల్చివేస్తామంటూ హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. తెలంగాణ కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టాడు. పదవులు ప్రజలు ఇస్తే వస్తాయని నమ్మే వ్యక్తి పొన్నం.