Telangana Liberation Day: సెప్టెంబర్ 17పై రాజకీయ పార్టీల ఫోకస్.. పోటాపోటీగా సభలు..!

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో దీనికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. ఆ సమయంలో బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించేవి. అయితే, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి ఇష్టపడలేదు.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 02:13 PM IST

Telangana Liberation Day: సెప్టెంబర్ 17 అనగానే తెలంగాణ విమోచన దినం గుర్తొస్తుంది. కొందరు దీన్ని తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా కూడా జరుపుకొంటారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో దీనికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. ఆ సమయంలో బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించేవి. అయితే, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి ఇష్టపడలేదు. ఒక వర్గం మద్దతు కోసం ఈ పని చేసింది.

అయితే, బీజేపీ, కాంగ్రెస్, ఇతర తెలంగాణవాదులు మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం, దీనికి అంత ప్రాధాన్యం ఏర్పడటతో క్రమంగా బీఆర్ఎస్ కూడా దిగొచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఇదంతా ఇప్పుడెందుకూ అంటే.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు రాజకీయ పార్టీలు ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.
మూడు పార్టీలు.. భారీ సభలు
ఈ నెల 17, ఆదివారం రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ సభలు నిర్వహించేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అసలే ఇది ఎన్నికల సమయం. ప్రతిదాన్నీ రాజకీయంగా వాడుకోవడం పార్టీలకు సహజం. అందుకే సెప్టెంబర్ 17ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. అదే రోజు కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు కీలక నేతలు హాజరవుతుండటంతో, 17న భారీ సభకు ప్లాన్ చేసింది. తుక్కుగూడలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించబోతుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ వేడుకలు నిర్వహిస్తుండటంతో బీఆర్ఎస్ కూడా రేసులోకి దూసుకొచ్చింది. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17న కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. గతంలో ఆయన దీన్ని వ్యతిరేకించారు. కానీ, ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో స్వయంగా హాజరుకాబోతున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా బీఆర్ఎస్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతీయ పతాకాన్ని కూడా ఎగురవేస్తారు.
కేసీఆర్‌ను ఆహ్వానించిన బీజేపీ
తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణలో ఒక ట్విస్ట్ ఉంది. సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్​ పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే సభను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుండటంతో దీనికి సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు తుక్కుగూడలో భారీ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. దీనికి కనీసం పది లక్షల మంది తరలివస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇదే సభలో కాంగ్రెస్ తరఫున ఐదు డిక్లరేషన్లను సోనియా గాంధీ ప్రకటిస్తారు. మూడు పార్టీలకు సంబంధించిన భారీ సభలు హైదరాబాద్‌లోనే జరుగుతుండటంతో నగరమంతా రాజకీయ వాతావరణం కనిపించడం ఖాయం.