Top story: అయ్యా సీఎం గారు… టీచర్లు దొంగలు మీ మంత్రులు సుద్దపూసలా?

నాలుగు మెతుకులు తినాలంటే భయం భయంగా ఉంటోంది. రెండు ముద్దలైనా తిని ఆకలికోతను చల్లార్చుకుందామంటే ప్రాణం ఉంటుందో పోతుందో అనే గుబులు కమ్మేస్తోంది. పాపం విద్యార్ధిని విద్యార్ధుల పరిస్ధితిని చెప్పాలంటే, వాళ్ల దుస్ధితిని వివరించాలంటేనే ఇబ్బందిగా ఉంది.

  • Written By:
  • Publish Date - November 28, 2024 / 03:45 PM IST

నాలుగు మెతుకులు తినాలంటే భయం భయంగా ఉంటోంది. రెండు ముద్దలైనా తిని ఆకలికోతను చల్లార్చుకుందామంటే ప్రాణం ఉంటుందో పోతుందో అనే గుబులు కమ్మేస్తోంది. పాపం విద్యార్ధిని విద్యార్ధుల పరిస్ధితిని చెప్పాలంటే, వాళ్ల దుస్ధితిని వివరించాలంటేనే ఇబ్బందిగా ఉంది. తెలంగాణ గురుకులాల్లో , సంక్షేమ హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల పరిస్ధితి దయనీయంగా ఉంది. మధ్యాహ్నా భోజనంలో కలుషిత ఆహారమే కాలర్ ఎగరేస్తుండటంతో స్టూడెంట్స్ పరిస్ధితి గాల్లో దీపంలా తయారయింది. నమ్మేందుకు సాక్ష్యాలు కావాలంటే లెక్కలతో సహా చూపించేందుకు నేను సిద్థం.

2024 ఫిబ్రవరి నుంచి తెలంగాణలోని గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలను మచ్చుకు కొన్ని చూద్దాం.. భువనగిరి గురుకుల హాస్టల్‌లో కల్తీ ఆహారంతో 40 మంది విద్యారులకు వాంతులు, విరేచనాలు అయితే… చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి మరణించాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గురుకుల హాస్టల్‌లో 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేజీబీవీ గురుకుల హాస్టల్‌లో కల్తీ ఆహారంతో 20 మంది విద్యార్థులకు అస్వస్థత,నల్గొండ జిల్లా నేరేడుచర్ల గురుకుల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌తో నలుగురు విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గురుకుల హాస్టల్‌లో కల్తీ ఆహారంతో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులకు అస్వస్థత, జనగామ జిల్లా కేంద్రం పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు 8మంది విద్యార్థినులకు అస్వస్థత. మంచిర్యాల సాయి కుంట గిరిజన బాలికల హాస్టల్‌లో క‌లుషిత ఆహారం తిని 12 మంది స్టూడెంట్స్ కు అస్వస్ధత. వాంకిడి ప్రభుత్వ గిరిజన హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ తో 30మంది విద్యార్ధినులు హాస్పిటల్‌లో చేరిక.. తాజాగా నారాయణ పేట్ జిల్లాలోని మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నా భోజనం తిని దాదాపు 20మంది విద్యార్ధిని విద్యార్ధులు హాస్పిటల్లో చేరిక.. చూసారుగా ఈ తిరుగులేని సాక్ష్యాధారాలు… ఇవే కాదు చాలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కు విద్యార్ధిని విద్యార్ధుల జీవితాలపై ఏ స్ధాయిలో నిర్లక్ష్యం ఉందో, ఏ స్ధాయిలో బాధ్యతారాహిత్యం ఉందో చూపించే కొన్ని దుర్ఘటనలు మాత్రమే ఇవి.

ఏముంది.. విద్యార్ధులకు కలుషిత ఆహారం పెట్టి, వాళ్ల ప్రాణాల మీదకు తీసుకొచ్చినందుకు ఆయా హాస్టల్ వార్డెన్స్, ఆయా ప్రిన్సిపాల్స్ , సంబంధిత టీచర్లు, వంట మనుషులను సస్పెండ్ చేస్తే సరిపోతుంది. దెబ్బకు అంతా సెట్ అవుతారు అనేది కనుక మీ స్టేట్ మెంట్ అయితే….మీకు కూడా నేడు విద్యార్ధిని విద్యార్ధులుగా రేపటి భావిభారత పౌరులు పట్ల నిర్లక్ష్యం అత్యంత బాధ్యతారాహిత్యం ఉన్నట్లే.. ఇన్ని వరుస ఘటనలు జరుగుతున్నాయంటే తప్పులు టీచర్లు,వార్డెన్లు, ప్రిన్సిపాల్స్ మాత్రమే చేస్తున్నారా.. తప్పు అసలు ప్రభుత్వానిది లేదా అని ఒక్క సెకను అయినా ఆలోచిస్తే… అసలు నిజం అర్ధమవుతుంది. నారాయణ పేట జిల్లా మాగనూర్ ఫుడ్ పాయిజన్ దుర్ఘటనను లోతుగా స్టడీ చేస్తే తప్పు ఎక్కడుంది, నేరం ఎవరు చేసారనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణం… మధ్యాహ్న భోజన పథకంలో కలుషిత ఆహారం విద్యార్ధులకు పెట్టడం. పురుగులు పట్టిన అన్నాన్ని, కుళ్లిపోయిన కోడి గుడ్లను విద్యార్ధులు తినటం. ఇందుకు బాధ్యులను చేస్తూ… సీఎం రేవంత్ సర్కార్… గెజిటెడ్ హెడ్ మాస్టర్ మురళీధర్ రెడ్డి, బయోసైన్స్ టీచర్ బాబురెడ్డిని సస్పెండ్ చేసింది. రెండవరోజు కూడా ఇదే రిపీట్ కావటంతో… DEO అబ్దుల్ ఘనీని కూడా సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. కానీ పైరవీలు చేయడంలో దిట్ట, అవినీతి అనకొండ అనే బ్రాండ్ ఉన్న DEO అబ్దుల్ ఘనీకి మాత్రం రెండు రోజుల వ్యవధిలోనే పోస్టింగ్ ఇచ్చింది సర్కార్. లాబీయింగ్ చేసుకోవటం చేతకాని హెడ్ మాస్టర్ మురళీధర్ రెడ్డి, బయోసైన్స్ టీచర్ బాబురెడ్డి పై మాత్రం సస్పెన్షన్ లోనే ఉంచింది. ఇదేం న్యాయం, ఇదేం సవతి ప్రేమ అంటూ సాక్షాత్తూ ప్రభుత్వ టీచర్లే రోడ్డెక్కి గర్జిస్తున్నారు. రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నారు.

తప్పంతా ప్రభుత్వ ఉద్యోగులదేనా, ప్రభుత్వానిది ఏది లేదా…. ఉంది ఎందుకు లేదు. అమాయక విద్యార్ధిని విద్యార్ధులకు ఈ నరకయాతన ఇచ్చిన పాపంలో తెలంగాణ ప్రభుత్వానికే అతి పెద్ద వాటా ఉంది. కలుషిత ఆహారం సరఫరా చేసింది, చేయించింది ఎవరు? పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిపోయిన కోడిగుడ్లు గురుకులాలకు, హాస్టల్స్‌కు సప్లై చేస్తోంది ఎవరు? సర్కార్ కాదు ఏజెన్సీలు అంటారా అయితే ఈ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతుంది ఎవరు? పోనీ కుకింగ్ అండ్ సప్లై ఏజెన్సీలే తప్పు చేసాయి అనుకుంటే.. ఎవడు నిలదీస్తాడు, ఎవడు వచ్చి చూస్తాడు అనే గర్వం వారిలో పెరిగిన పాపానికి ప్రభుత్వానిది బాధ్యత కాదా? ఒక ఏడాది వ్యవధిలో ఇన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే… పిల్లలు పిట్టల్లా రాలిపోతోంటే తెలంగాణ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోతే ఎలా? బాధ్యులు ఎవరైనా సరే సస్పెన్షన్ వేటు తప్పదు అంటూ కేవలం ప్రభుత్వ ఉద్యోగులపైనే చర్యలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి… విద్యాశాఖమంత్రి ఎందుకు కనిపించలేదు. ఎందుకు వరుస కలుషిత ఆహార ఘటనలకు బాధ్యులను చేస్తూ…మంత్రులను ఎందుకు సస్పెండ్ చేయటంలేదు. ఎందుకంటే ఇది రాజకీయం అని అనుకోవాలా?

సీఎం రేవంత్ రెడ్డి గారు… పిల్లలు సార్ వాళ్లు..ఇంకా చెప్పాలంటే వాళ్లు నిరుపేద విద్యార్ధులు సార్… ప్రభుత్వం పోషకాహారం అందిస్తుందనే నమ్మకంతో పొట్ట చేత పట్టుకుని, బండెడు పుస్తకాలు మోస్తూ స్కూల్స్, హాస్టల్స్ కు వచ్చిన వాళ్లు సార్. దయచేసి వాళ్లకు పౌష్ఠికాహారం పెట్టండి. రుచికరమైన భోజనం వాళ్లకు అందేలా పటిష్ఠ ఏర్పాట్లు చేయండి. ఇద్దరు ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా… విద్యాశాఖమంత్రితో పాటు మరొకమంత్రికి బాధ్యతలు అప్పగించి..లోపాలను సరిచేసుకుంటూ బంగారు భవిష్యత్తును విద్యార్ధిని విద్యార్ధులకు కానుకగా ఇవ్వండి. తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ…!