TELANGANA BJP: కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణలో ఊపుమీదున్న బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. బండి సంజయ్ దూకుడుతో ఒక్కసారిగా ప్రజల్లోకి దూసుకెళ్లిన బీజేపీ.. ఇప్పుడు చతికిలపడింది. బండి సంజయ్ మార్పుతోనే తెలంగాణలో బీజేపీ పతనం ప్రారంభమైందన్న వాదనలున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బీజేపీ రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, కవిత వ్యవహారమే బీజేపీ కొంప ముంచిందనే వాదనా ఉంది.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించింది బీజేపీ. తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ పార్టీని బలోపేతం చేశారు. పాదయాత్రలు, సభలు, ర్యాలీలు వంటి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైంది. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దూకుడుగా వ్యవహరించడం బీజేపీకి కలిసొచ్చింది. దీంతో వివిధ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీవైపు చూశారు. ఇదే సమయంలో పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అధిష్టానం బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసింది. అంతే.. బీజేపీ ఊపు ఒక్కసారిగా తగ్గిపోయింది. కొద్దిమంది నేతలు మినహా బీజేపీలోని ఇతర నేతలు, కార్యకర్తలే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. బీజేపీకి తెలంగాణలో దారి చూపిన బండిని తొలగించడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. దీంతో పార్టీకి ఊపు తగ్గింది. ఇదే సమయంలో బీఆర్ఎస్‌తో, బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుందనే ప్రచారం బీజేపీ కొంప ముంచింది. ముఖ్యంగా కవిత విషయంలో కేంద్ర వైఖరి తలనొప్పులు తెచ్చింది.
కవితను అరెస్టు చేయకపోవడమే తప్పా..?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధానంగా వినిపించిన పేరు కల్వకుంట్ల కవిత. ఆమెకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలున్నాయని, త్వరలోనే అరెస్టు చేస్తామని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బీజేపీ నేతలు కూడా ఇదే చెప్పారు. రేపో.. మాపో.. కవిత అరెస్టు తప్పదన్న ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఇప్పటిదాకా కవితను సీబీఐ, ఈడీ అరెస్టు చేయలేదు. ఈ కేసు నుంచి కవితను దాదాపు తప్పించారనే ప్రచారం ఊపందుకుంది. కవితను అరెస్టు చేయకుండా కేసీఆర్, కేటీఆర్‌లు కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఆరోపించాయి. కవితను రక్షించుకునేందుకే బీజేపీకి కేసీఆర్ లొంగిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. తర్వాతి పరిణామాలు కూడా దీనికి తగ్గట్లే ఉన్నాయి. కేంద్రంపై గతంలోలాగా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడం లేదు. కాంగ్రెస్‌పైనే బీఆర్ఎస్ గురిపెట్టింది. బీజేపీ కూడా కేసీఆర్‌కు అనుకూలమైన చర్యలు ప్రారంభించినట్లు అనిపించింది. కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటారనే పేరున్న కిషన్ రెడ్డికి తెలంగాణ పగ్గాలు అప్పగించింది బీజేపీ. కేసీఆర్‌పై దూకుడు ప్రదర్శించిన బండిని తప్పించింది. లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్టు చేయకపోవడం, బండిని తప్పించి, కిషన్ రెడ్డిని నియమించడంతో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ఏర్పడింది. బీజేపీలో చేరినా.. బీఆర్ఎస్‌కు అనుకూలంగానే ఉంటుందన్న ప్రచారంతో ప్రజలు, నేతలు బీజేపీని నమ్మడం మానేశారు. అందుకే మొన్నటివరకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన నేతలు కూడా ఆ పార్టీవైపు కన్నెత్తి చూడటం లేదు. కేసీఆర్‌ను విబేధించి, బీజేపీలో చేరిన నేతలు క్రమంగా బీజేపీని వీడుతున్నారు.
ఇప్పుడేం చేస్తుంది..?
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనేలా జరిగిన పరిణామాలతో బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మడం మానేశారు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటున్నప్పుడు ప్రత్యేకించి, బీజేపీకి అండగా నిలబడటం వృథా అని తెలంగాణ సమాజం భావిస్తోంది. అందుకే బీజేపీకి ఆదరణ తగ్గుతోంది. ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన సభకు వచ్చిన స్పందనే దీనికి నిదర్శనం. బీజేపీ కూడా ఇందుకు తగ్గట్లే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నిజంగా పుంజుకోవాలి అనుకుంటే.. అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి.