MLC KAVITHA: లిక్కర్ స్కాంలో కవితపై చర్యలేవి.. అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనా?

కవిత విషయంలో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించినట్లు ఈటల, కోమటిరెడ్డి చెప్పారు. కవిత విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానానికి సూచించినట్లు తెలిపారు. కవితపై చర్యలు తీసుకోకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లోకి వెళ్లిందని చెప్పారు.

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 12:59 PM IST

MLC KAVITHA: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత అంశం హాట్ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కాంలో కవిత పేరున్నట్లు, ఆమె పాత్రపై ఆధారాలున్నట్లు గతంలో చెప్పిన ఈడీ, సీబీఐ ఆమెపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసింది సీబీఐ. చివరకు ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియాను కూడా అరెస్టు చేసింది. అయితే, కవిత విషయంలో మాత్రం దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయ్యాయి. దీంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని, దీనిలో భాగంగానే కవితపై చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఈ అంశమే అటు బీజేపీలో, ఇటు కాంగ్రెస్‌లో చర్చకు దారి తీస్తోంది.
ప్రశ్నించిన ఈటల, కోమటిరెడ్డి
ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులు, బీజేపీ భవిష్యత్తుపై చర్చ జరిగింది. కవిత విషయంలో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించినట్లు ఈటల, కోమటిరెడ్డి చెప్పారు. కవిత విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానానికి సూచించినట్లు తెలిపారు. కవితపై చర్యలు తీసుకోకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లోకి వెళ్లిందని వివరించినట్లు చెప్పారు. ఇప్పటికైనా కవితను అరెస్టు చేయకపోతే రెండు పార్టీలూ ఒకటే అని ప్రజలు నిర్ధరణకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ కూడా స్పందిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి కాబట్టే కవితపై చర్యలు తీసుకోకపోవడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రెండు పార్టీలూ గల్లీల్లో తిట్టుకుంటూ.. ఢిల్లీలో కలిసిపోయాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
బీజేపీ నేతల అసంతృప్తి
కవిత విషయంలో బీజేపీ నేతలు కూడా అసంతృప్తికి లోనవుతున్నారు. కవితను అరెస్టు చేయకుండా నాన్చడం, కేసులో అతీగతీ లేకుండా ఉండటం తెలంగాణ బీజేపీకి ఇబ్బందిగా మారింది. రెండు పార్టీలూ ఒకటే అని జరుగుతున్న ప్రచారానికి బీజేపీ నేతలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోతే కవితను అరెస్టు చేయొచ్చు కదా అంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కవితను అరెస్టు చేసి, కల్వకుంట్ల కుటుంబ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తే బీజేపీకి ప్రయోజనం ఉండేది. కానీ, బీజేపీ పెద్దలు అలా చేయకపోవడంతో ప్రజల్లోకి ఏ అంశంతో వెళ్లాలో తెలంగాణ నేతలకు పాలుపోవడం లేదు. దీంతో కొంతకాలంగా బీజేపీ తెలంగాణ నేతలు కూడా సైలెంట్ అయ్యారు. బీజేపీలో పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ కనిపించడం లేదు. రెండు పార్టీలూ ఒక్కటే అనే అభిప్రాయానికి వచ్చిన నేతలు అసంతృప్తితో కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
చీకటి ఒప్పందం నిజమేనా..?
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజంగానే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహనా ఒప్పందం ఉందేమో అనిపించకమానదు. లిక్కర్ స్కాంలో కవితపై చర్యలు లేవు. గతంలోలాగా కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడటం లేదు. ఇటు బీజేపీ నేతలు మౌనంగా ఉంటుంటే.. బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీపై విమర్శలు చేయడం లేదు. పైగా రెండు పార్టీలూ కాంగ్రెస్‌నే టార్గెట్ చేశాయి. దీంతో రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. బీజేపీ సైలైంట్ అయింది.