తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ తో ఆయన తెలంగాణలో పెద్ద చర్చనే లేవనెత్తారు. KCR అసలు తెలంగాణ వాడే కాదనీ.. ఆయన ఎక్కడి నుంచో వలస వచ్చాడనీ.. తాను మాత్రం పది తరాలు వెనక్కి వెళ్లి చూసినా అసలు సిసలైన తెలంగాణ DNAవాణ్ని అని రేవంత్ చెబుతున్నారు. శుక్రవారం జరిగిన ఓ టీవీ డిబేట్ లో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలమ కులస్తులు మొదట బిహార్ నుంచి ఉత్తరాంధ్రకు వలస వచ్చారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం నుంచి KCR తాత తెలంగాణకు వలస వచ్చారనీ… ఈ విషయం కేసీఆరే స్వయంగా గతంలో లైవ్ షోలో చెప్పారని గుర్తు చేశారు రేవంత్.. చారిత్రకంగా వెలమలకి తెలంగాణ భూభాగంతో ఏ రకమైన సంబంధాలు లేవని.. వాళ్లు బీహార్లో పుట్టి అక్కడి నుంచి ఉత్తరాంధ్రకు వచ్చి ఆ తర్వాత తెలంగాణకు చేరుకున్నారనేది రేవంత్ వాదన. అందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని.. కేసీఆరే స్వయంగా చెప్పారని రేవంత్ అంటున్నారు. అంతేకాదు తెలంగాణలో పది తరాలు వెనక్కి చూసినా రెడ్లు స్థానికులేననీ.. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళని చెప్పారు. తన కుటుంబం ఏడు తరాలు వెనక్కి చూసుకున్నా ఇక్కడ వాళ్లమేననీ.. అందువల్ల వెలమలు నాన్ లోకల్ .. రెడ్లు తెలంగాణకు అసలు సిసలైన లోకల్ రేవంత్ తెలిపారు. ఎక్కడి నుంచో వలస వచ్చి ఇప్పుడు తెలంగాణపై కేసీఆర్ జులుం చేస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. ఎప్పటికైనా తెలంగాణకి అసలు సిసలైన వారసులని నన్ను రేవంత్ రెడ్డి అని అంటారు తప్ప.. మరో పేరుతో పిలవరని అన్నారు. చివరికి తనకు రేటెంత రెడ్డి అని నిక్ నేమ్ పెట్టినా ..దానికి కూడా రెడ్డే అని ఉందని ఆ టీవీ చర్చలో చెప్పుకొచ్చారు.
తెలంగాణలో రెడ్లు మీకు పూర్తి మద్దతు ఇస్తున్నారా.. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. అందులో తప్పేముందని తనకు రెడ్ల నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పుకున్నారు రేవంత్. BRS లో ఉంటేనే తెలంగాణ వాదులు.. వేరే పార్టీలో ఉంటే తెలంగాణ ద్రోహులు అనడం ఫ్యాషన్ అయిందని మండిపడ్డారు రేవంత్. తెలంగాణ వద్దని తాను టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఏ రోజూ చెప్పలేదన్నారు. ధరణిపేరుతో రెవెన్యూ రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి… వందల ఎకరాలను మాయం చేశారని ఆరోపించారు రేవంత్. తాము అధికారంలోకి వస్తే ఆ గుట్టు బయటపెడతామని హెచ్చరించారు. సీఎంలు మార్చే సంప్రదాయం కాంగ్రెస్ కు ఉందని.. KCR తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలే వచ్చాయి.. అక్కడ సీఎంలు మారారా. కాంగ్రెస్ లో ఎవరైనా సీఎం అవుతారు. కానీ BRS లో హరీష్ రావు సీఎం అవుతారని చెప్పగలరా అని ప్రశ్నంచారు రేవంత్ రెడ్డి.