Telugu Desam Party: సత్తెనపల్లిలో కోడెల కుమారుడి తిరుగుబాటు.. కన్నాకు, టీడీపీకి అసలు సవాళ్లు తప్పవా ?

టీడీపీకి డూ ఆర్‌ డైలాంటివి 2024 ఎన్నికలు. మళ్లీ ఓడిపోతే.. పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే విజయమో.. వీరస్వర్గమో అనే రేంజ్‌లో 2024 ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు చంద్రబాబు.

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 01:13 PM IST

అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. గెలుపు మీద ఏ చిన్న అనుమానం ఉన్నా.. వారిని పక్కనపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. కన్నాను పార్టీలో చేర్చుకుంది.. సత్తెనపల్లి ఇంచార్జిని చేసింది కూడా అందుకే ! కోడెల శివప్రసాద్ మరణం తర్వాత సత్తెనపల్లికి ఎవరినీ ఇంచార్జిగా నియమించలేదు చంద్రబాబు. ఐతే కోడెల కుమారుడు శివరాం మాత్రం టికెట్ మీద భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఇప్పుడు చంద్రబాబు మాత్రం.. కన్నాకే దాదాపు టికెట్ కన్ఫార్మ్ చేశారు. ఇదే ఇప్పుడు సత్తెనపల్లికి టీడీపీలో ముసలం పుట్టించబోతుందా అంటే అవును అనే చర్చే జరుగుతోంది.

కోడెల శివరాం బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు అనుసరిస్తూ.. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని.. పక్క పార్టీ నుంచి ఒకరిని తీసుకువచ్చి ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జి రేసులో.. ప్రధానంగా ముగ్గురు నేతలు రేసులో కనిపించారు. ఐతే కోడెల కుమారుడు శివరాం ఫస్ట్‌ వరుసలో ఉండగా.. ఆ తర్వాత మాజీ ఎంఎల్ఏ వైవీ ఆంజనేయులు, టీడీపీ యువ నాయకుడు మల్లి ఉన్నారు. వీళ్లందరిని కాదని.. కన్నా లక్ష్మీనారాయణకు ఇంచార్జి పదవి అప్పగించారు చంద్రబాబు.

ఇది సత్తెనపల్లి టీడీపీలో చిన్నపాటి తుఫాన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణను ఇంచార్జిగా నియమించిన తర్వాత.. కోడెల శివరాం తన అనుచరులతో వెంటనే భేటీ అయ్యారు. ఇదే ఇప్పుడు టీడీపీని టెన్షన్ పెడుతోంది. కోడెల మరణం తర్వాత పార్టీ మీద సింపథీ క్రియేట్ అయింది. అలాంటిది ఆయన కుమారుడే పార్టీ మీద తిరుగుబాటు చేస్తే.. పార్టీకి భారీ నష్టం చేయడం ఖాయం. అధిష్టానం ఆదేశాలతో.. వైపీ ఆంజనేయులు, మల్లి సర్దుకుపోయేందుకు రెడీ అవుతున్నా.. శివరాం మాత్రం ససేమిరా అంటున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది.

సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అనుభవం కన్నాకు లేకపోయినా.. ఆయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అంబటికి దీటుగా ఆయనను బరిలోకి దింపింది కూడా అందుకే ! కన్నా రాకపై అసంతృప్తితో ఉన్న శివరాం వ్యవరాహాన్ని వైసీపీ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ కోపాల్‌, తాపాల్‌, అలకల్‌కు చంద్రబాబు త్వరగా బ్రేక్‌ వేస్తే తప్ప.. సత్తెనపల్లిలో పరిస్థితులు సర్దుకునే పరిస్థితి లేదు. అలా కాకుండా ఇంకేది జరిగినా.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.