తెలంగాణలో పార్టీని బతికించాలని.. ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ సక్సెస్ అవుతాయా అంటే.. గతంలో చేసిన పాపాలు ఆ విజయాన్ని అడ్డుకోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. మహానాడులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది టీడీపీ. పేరుకు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల అయినా.. చంద్రబాబు, లోకేశ్ గురించి డప్పే ఎక్కువ వినిపించింది అక్కడ ! ఇదంతా ఎలా ఉన్నా.. మినీ మేనిఫెస్టోను ప్రకటించారు చంద్రబాబు ఆ సభలో ! వైసీపీ హామీలకు అడ్వాన్స్‌డ్ వర్షన్‌లా ఉన్నాయ్ తప్ప.. ఇంకేముంది అనే అనుమానాలు వినిపిస్తున్నా.. ఈ హామీలు పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయా అంటే కష్టమే !
రాజకీయాల్లో హత్యలు ఉండవ్.. ఆత్మహత్యలు తప్ప ! ఒక్క తప్పుడు నిర్ణయం చాలు.. పార్టీ భవిష్యత్‌ను డిసైడ్ చేయడానికి ! ఆ తప్పే.. పాపంలా మారి శాపంలా వెంటాడుతుంది.
శతజయంతి ఉత్సవాలు అంటూ.. ఎన్టీఆర్ మీద చంద్రబాబు ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నా.. గతం మాత్రం ఇంకా చర్చలోనే ఉంది తెలుగు రాష్ట్రాల్లో ! ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటు పాపం.. ఏదో ఒక రూపంలో చంద్రబాబును వెండాడుతూనే ఉంది. చంద్రబాబు ఎన్ని చెప్పినా.. వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ఇప్పటికీ ఎప్పటికీ మచ్చే ఆయనకు ! చంద్రబాబు చేసిన ఆ పాపమే.. ప్రతీసారి ప్రత్యర్థికి ఆయుధంగా మారుతుంది. చంద్రబాబును వెంటాడుతోంది. తెలంగాణలో పార్టీని బతికించుకుందా అనుకుంటే.. అక్కడా ఇలాంటి పాపాలే చేశారు చంద్రబాబు.
ఉద్యమ సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ.. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖ.. మహాపాపంగా మారింది. చంద్రబాబు చేసిన ఆ తప్పు.. తెలంగాణలో సైకిల్ పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బతీసింది. పసుపు దళం అని చెప్పుకోవడానికి వారిని భయపడేలా చేసింది. టీడీపీ ఎదుగుదామనుకున్న ప్రతీసారి చంద్రబాబు చేసిన ఈ పాపం.. తెలంగాణలో పార్టీని వెంటాడుతూనే ఉంటుంది. ఓవరాల్ కెరీర్‌లో చంద్రబాబు చేసిన మరో మహాపాపం.. కాంగ్రెస్‌తో పొట్టుకోవడం. ఢిల్లీ పెత్తనానికి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడిందే తెలుగుదేశం పార్టీ. అలాంటిది అదే కాంగ్రెస్‌తో పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు. 2018 తెలంగాణ ఎన్నికల్లో చేతిలో చేయేసి.. దిద్దుకోలేని తప్పు చేశారు. ఈ తప్పును టీడీపీ మర్చిపోయినా.. తెలుగు తమ్ముళ్లు మర్చిపోయినా.. చరిత్ర మాత్రం ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది.
ఇలా వరుస పాపాలతో తనను తాను పక్కా అవకాశవాదిగా, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంగా ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు చంద్రబాబు. అలాంటి వ్యక్తి.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనాల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఎన్టీవోడి బొమ్మ సాక్షిగా మినీ మేనిఫెస్టో ప్రకటించారు. ఇవి వర్కౌట్ అవుతాయా కావా అన్నది కాదు మ్యాటర్.. చేసిన పాపాలు చంద్రబాబును ఎప్పటికీ వెంటాడుతాయి.. జనం మాట.. జనంలో మాట ఇదే అన్నది మాత్రం క్లియర్.