Telugudesam: టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీకి వణుకు.. జగన్ గుప్పించబోయే హామీలు ఏంటి ?

ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది సమయంలో ఉన్నా.. రాజకీయాలు మాత్రం ఇప్పటి నుంచే భగ్గుమంటున్నాయ్. ఎవరు ఏంటన్న సంగతి పక్కనపెడితే.. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తున్నాయ్ రెండు పార్టీల ఎత్తుగడలు. మాటలు తూటాల్లా పేలుతుంటే.. వ్యూహాలు పాదరసంలా కదులుతున్నాయ్. దీంతో 2024 ఎవరిది అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 04:36 PM IST

దీనికితోడు ముందస్తు ఎన్నికలు అంటూ జరుగుతున్న ప్రచారంతో.. వేడి మరింత రాజుకుంది. టీడీపీ అయితే ఓ అడుగు ముందుకేసి.. ముందుగానే మేనిఫెస్టో ప్రకటించింది. రైతులు, మహిళలు, యువత.. మూడు వర్గాలను టార్గెట్ చేస్తూ.. మహానాడు వేదికగా వరాలు గుప్పించింది టీడీపీ. ఉచితాలు వద్దు అంటూనే.. అన్ని ఉచితాలే ప్రకటించారు చంద్రబాబు. దీని మీద వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. మీరు చెప్పింది ఏంటి.. చేస్తుంది ఏంటని కొందరు.. అది మేనిఫెస్టో కాదు మోసఫెస్టో అని ఇంకొందరు.. సైకిల్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.

టీడీపీ ముందుగానే మేనిఫెస్టో ప్రకటించడంతో.. వైసీపీలో వణుకు మొదలైందని కొందరు విమర్శలు గుప్పిస్తుండగా.. ఇప్పుడు అధికార పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అన్ని వర్గాల్లో కనిపిస్తోంది. ఉచిత హామీలు గుప్పించి గత ఎన్నికల్లో వైసీపీ అధికారం కట్టబెట్టింది. ఇప్పుడు టీడీపీ కూడా దాదాపు వైసీపీ హామీలను అటు ఇటు మార్చి హామీలు ఇచ్చింది. టీడీపీకి కౌంటర్ ఇచ్చేలా వైసీపీ ఏం చేయబోతోంది.. జనాల దగ్గరికి ఏ హామీలతో జగన్ వెళ్లబోతున్నారు. మేనిఫెస్టోలో ఎలాంటివి ఉండబోతున్నాయన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఉచితాలతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలన్న జగన్ ఆదేశాలతో.. ప్రత్యేకమైన టీమ్ మేనిఫెస్టో సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

అన్ని వర్గాల జనాలను ఆకట్టుకునేలా.. కొత్త మేనిఫెస్టోను రూపొందించేందుకు ఈ టీమ్ పనిచేస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న సామాజికవర్గాలను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ, జనసేన కలిస్తే కాపు ఓటు బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉండడంతో.. ఆ సామాజికవర్గంపై మరింత దృష్టిసారిస్తున్నారట. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను.. కొంతమేర పెంచడంతో పాటు, కొత్త పథకాలు కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలతో పాటు… యువత ఎక్కువగా లబ్ధి పొందే విధంగా కొత్త స్కీములను రెడీ చేస్తున్నారనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు. అంతకుముందే మేనిఫెస్టో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయ్.

జిల్లాల పర్యటనలో మేనిఫెస్టోలో ఉన్న పథకాలను ఒక్కోటిగా జగన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ సర్కార్‌కు ప్రధానమైన సవాల్.. మూడు రాజధానుల వ్యవహారంలోనే వినిపిస్తోంది. దీని మీద మేనిఫెస్టోలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలకు ఎలాంటి లబ్ది చేకూరబోతోంది.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందబోతుందని వివరంగా ఇందులో వివరించే చాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారమే అయినా.. ఈ మేనిఫెస్టోలు జనాల మనసు గెలిచేలా చేస్తుందా లేదా అంటే ఎదురుచూడాల్సిందే.