ఆపద మొక్కులవాడి దర్శనం కోసం వెళ్ళే లక్షలాది మంది భక్తులకు బాంబు బెదిరింపులు ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి. దేశంలోనే ప్రముఖ నగరంలో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పరుగులు పెట్టిస్తున్నాయి బాంబు బెదిరింపు కాల్స్. నిన్నటి వరకు విమానాలు… నేడు తిరుమల నగరం. వరుస బాంబు బెదిరింపులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని తిరుపతి వాసులు కూడా భయం భయంగా బ్రతుకుతున్నారు. తిరుమలలో అసలు ఉగ్రవాదులు అడుగుపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ తో తిరుపతి నగరంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి బెదిరింపు మెయిల్ వస్తుందో అని భయంతో ఉన్నారు నగర వాసులు. బెదిరింపు మెయిల్స్ పై అలిపిరిలో రెండు, ఈస్ట్ లో రెండు కేసులు నమోదు చేసారు. బెదిరింపు మెయిల్స్ పై ఎన్ ఐఏ అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక టెక్నికల్ టీంతో మెయిల్స్ ఎక్కడ నుండి వచ్చాయి అనే దానిపై ఎన్ ఐ ఏ , తిరుపతి పోలీసులు వర్కౌట్ చేస్తున్నారు. బెదిరింపులన్నీ ప్రాక్సీ యాప్స్ నుంచి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు.
రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో సహా ఇతర పబ్లిక్ వైఫైల నుంచి మెయిల్ పంపు ఉంటారని పోలిసులు భావిస్తున్నారు. ఐదు రోజులలో మూడుసార్లు పలుమార్లు ఐఎస్ ఐ పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ ను పంపడంతో కేంద్ర నిఘా వర్గాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఈ నెల24న తిరుపతిలోని రాజ్ పార్క్, రీనెస్ట్, పాయ్ వైస్రాయ్, రిగాలియాలకు బాంబు బెదిరింపుతో కూడిన మెయిల్స్ వచ్చాయి. 26 తేదినా రీనెస్ట్, రాజ్ పార్కు, పాయ్ వైస్రాయ్, రిగాలియా. గోవింద హైట్స్,తాజ్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
బెదిరింపు మెయిల్స్ రావడంతో ప్రాణ భయంతో హోటళ్లలోని రష్యన్ ,మలేషియా చెందిన విదేశీయులు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నిన్న రాజ్ పార్కు, రీనెస్ట్, ఫార్చ్యూన్ కెన్సెస్ హోటళ్లతో పాటు వరాహస్వామి ఆలయం, ఇస్కాన్ టెంపుల్ కు కూడా బెదిరింపులు వచ్చాయి. మెయిల్స్ వచ్చిన ప్రతిసారీ పోలీసులు పరుగులు తీస్తున్నారు. బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లతో ఆయా హోటల్స్ ,ఆలయాల్లో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ నగరవాసులకు…శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.
బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటి, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నామని నగరంలో భద్రత పెంచాం అని భక్తులకు, తిరుపతి వాసులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేసారు. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. అయితే విదేశీయులను టార్గెట్ చేయడానికి ఈ మెయిల్స్ వచ్చాయా అనే దానిపై పోలీసులు విచారణ వేగవంతం చేసారు. ఇస్కాన్ టెంపుల్ లో విదేశీయులు ఎక్కువగా ఉంటారు. ఇక ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. కుట్ర పూరితంగా ఈ మెయిల్స్ వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.