Thatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు మరో షాక్ .. రాజయ్య జంప్..?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నో చెప్పడంతో నిరాశకు గురైన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 08:25 PM IST

Thatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలబోతుందా..? టికెట్ దొరకని ఇంకో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ నుంచి జంప్ కాబోతున్నాడా..? అంటే రాజకీయ వర్గాలు అవునని అంటున్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నో చెప్పడంతో నిరాశకు గురైన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రాజయ్యను బుజ్జగించేందుకు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ ను బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. ఆయన ఇవాళ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాటికొండ రాజయ్య ఎలా స్పందించారనేది తెలియరాలేదు. అంతకుముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేసీఆర్ తన దూతగా తాటికొండ రాజయ్య వద్దకు పంపినా.. ఎలాంటి ఫలితం కనిపించలేదు. వాస్తవానికి రాజయ్య నివాసానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లిన టైంలో ఆయన అందుబాటులో లేరు. దీంతో తాటికొండ రాజయ్య అనుచరులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చించారు. ఎన్నికల తర్వాత రాజయ్యకు మంచి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు.
తాటికొండ రాజయ్య వైఖరి ఇదీ..
స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ టికెట్ ను ఈసారి కడియం శ్రీహరికి కేటాయించారు. దీంతో తాను కూడా మరేదైనా పార్టీ నుంచి బరిలోకి దిగి తీరాలని తాటికొండ డిసైడ్ అయ్యారట. పంట చేతికందగానే కుప్పపై కూర్చోవడానికి వేరే వాళ్లు వస్తే చూస్తూ కూర్చుంటామా అంటూ ఇటీవల రాజయ్య చేసిన కామెంటే ఆయన వైఖరికి సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రాజయ్యకు ఘన్‌పూర్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఈక్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహను రాజయ్య కలిశారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపింది.

దళిత మేధావుల సదస్సులో పాల్గొనేందుకు వరంగల్ కు వచ్చిన దామోదర రాజనర్సింహతో రాజయ్య దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని రాజయ్య బంధువులు చెబుతున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలను కూడా తోసిపుచ్చలేమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్టేషన్ ఘన్‌పూర్‌ నుంచి గెలిచిన ట్రాక్ రికార్డు తాటికొండ రాజయ్యకు ఉంది. ఆయన చేరిక ఘన్ పూర్ లో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రాజయ్య రెడీ అవుతున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..
115 మంది అభ్యర్థులకు టికెట్స్ కన్ఫార్మ్ చేస్తూ బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసిన తర్వాత.. రాజయ్య కన్నీళ్లు పెట్టుకొని సీఎం కేసీఆర్ గీసిన గీతను దాటబోనని చెప్పారు. ఇటీవల పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై తారసపడ్డారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పలకరించుకున్నారు. ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. ఈ క్రమంలో రాజయ్యకు ఏమనిపించిందో ఏమో కానీ మధ్యలోనే సడెన్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజయ్య చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపే ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.