Eetela Rajender: గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ మీద ఈటల పోటీ !

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ జోరు తగ్గింది. అధ్యక్షుడి మార్పు తర్వాత.. పరుగులు కాస్త నడకగా మారిపోయాయ్. కేడర్ అంతా డీలా పడిపోయింది. దీంతో పార్టీకి మళ్లీ పరుగులు నేర్పేందుకు, పరుగులు పెట్టించేందుకు బీజేపీ పెద్దలు సిద్ధం అయ్యారు.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 02:49 PM IST

రాష్ట్ర నేతలకు నడ్డా కీలక సూచనలు చేశారు. 75 స్థానాల్లో గెలిచి తీరాలని టార్గెట్‌ పెట్టిన నడ్డా.. ఎంత పెద్ద లీడర్ అయినా సరే అసెంబ్లీ బరిలో నిలవాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. 35 మంది స్ట్రాంగ్‌ లీడర్లను గుర్తించి.. ముందు ఆ స్థానాల మీద ఫోకస్ పెంచాలని సూచించారు. ఇలా పార్టీని పరుగులు పెట్టించేందుకు బీజేపీ పెద్దలు చర్యలు తీసుకుంటున్న వేళ.. సోషల్‌ మీడియాలో ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. గజ్వేల్‌ నుంచి కేసీఆర్ మీద ఈటల బరిలోకి దిగబోతున్నారన్నది ఆ న్యూస్‌ ఉద్దేశం. బీజేపీలో కీలక నేతలంతా ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకున్నారని.. దీనికి సంబంధించి లిస్ట్ ఇదే అటూ సోషల్ మీడియాలో ఓ జాబితా వైరల్ అవుతోంది.

అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి.. కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌.. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్‌.. దుబ్బాక నుంచి రఘునందన్‌ రావు.. చెన్నూరు నుంచి వివేక్‌.. భువనగిరి నుంచి బూర నర్సయ్య.. హుజురాబాద్ నుంచి ఈటల జమున.. గోషామహల్ నుంచి విక్రమ్‌ గౌడ్‌..సికింద్రాబాద్‌ నుంచి జయసుధ.. తాండూర్ నంచి కొండా విశ్వేశ్వర్.. ఇలా కొందరి పేర్లతో ఉన్న ఓ లిస్ట్ తెగ వైరల్ అవుతోంది. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయబోతున్నారనే ప్రచారమే ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.

గజ్వేల్‌ నుంచి పోటీ చేయాలని ఈటలను బీజేపీ అధిష్టానం కోరిందని తెలుస్తోంది. నిజానికి కేసీఆర్‌ మీద పోటీకి సిద్ధమని గతంలో ఈటల చాలాసార్లు మీడియా ముఖంగా సవాల్ విసిరారు. ఎవరి కారణంగా ఇబ్బంది పడ్డారో.. వాళ్ల మీద రివేంజ్ తీర్చుకునేందుకు నిజంగానే గజ్వేల్‌ నుంచి ఈటల పోటీకి దిగుతారా అనే చర్చ జనాల్లో వినిపిస్తోంది. మరి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లిస్టులో నిజం ఎంత అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. ఈటల సంగతి ఇలా ఉంటే.. ఈసారి గజ్వేల్‌ నుంచి కదిలి వేరే స్థానం నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఇదైనా నిజమా.. ప్రచారమా తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిదే.