కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణపై సీరియస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించనుంది. ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్ లో పార్టీ సభ ముగిశాక.. 18న సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక్కో కీలక నేత వెళ్లి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్యాడర్ ను మళ్లీ యాక్టివేట్ చేసేందుకే ఈ విధమైన వ్యూహరచనతో హస్తం పార్టీ ముందుకు వెళ్తోందని స్పష్టమవుతోంది.
ఇంటింటి ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు అనుకూలంగా మారేలా.. 17వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ సభలో సోనియాగాంధీ సహా పార్టీ కీలక నేతలు ఎన్నికల హామీలను, 5 కీలక సంక్షేమ పథకాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్.. బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లపైనా కసరత్తు చేస్తోంది. ఈ డిక్లరేషన్లనన్నింటినీ క్రోడీకరించి దాదాపు 10 హామీలను అధిష్ఠానం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే బీసీలు సహా అన్ని వర్గాలకూ ఇచ్చే హామీలను ప్రస్తావిస్తారని సమాచారం. సోనియాగాంధీ ప్రకటించనున్న 10 హామీలు, బీఆర్‌ఎస్ పై రిలీజ్ చేసే చార్జిషీట్‌లతో తెలంగాణ కాంగ్రెస్ జనంలోకి వెళ్లనుంది. 17న పరేడ్ గ్రౌండ్స్ సభ జరుగుతుంది. 18 నుంచి సోనియా ప్రకటించిన హామీలు, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విడుదల చేసిన చార్జిషీటుతో ఇంటింటి ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుంది. సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చే అన్ని రాష్ట్రాల సీడబ్ల్యూసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు.. ఇంటింటి ప్రచారం కోసం ఈనెల 17న రాత్రే ఒక్కొక్కరు చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు చేరుకుంటారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.
హామీలు ఇవేనా ?
రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, పింఛన్లు రూ.4 వేలకు పెంపు, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, అసైన్డ్ భూములపై సర్వహక్కులు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించనున్న ఎన్నికల హామీల జాబితాలో ఉన్నాయని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తామని.. ఐదేళ్లలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రజలకు వివరించనున్నట్టు పేర్కొంటున్నాయి.
పరేడ్ గ్రౌండ్స్‌లోనే ఎన్నికల శంఖారావం.. ?
బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను 17న పరేడ్ గ్రౌండ్స్ సభలోనే ప్రకటించనున్నారని సమాచారం. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు స్కీమ్‌ల పేరుతో ఐదు ప్రధాన హామీలు ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లోనూ విజయం సాధించిన కాంగ్రెస్ తమ హామీలను నిలబెట్టుకునే దిశగా ముందుకెళుతోంది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ 5 గ్యారెంటీ స్కీమ్‌లను అమలుచేస్తామని హామీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.