ప్రభుత్వం ఇచ్చినవి వెనక్కిచేసి… ఇల్లే ఆఫీస్ గా మార్చిన డిప్యూటీ సీఎం.. ఎవరు ఉన్నారు నీలా?

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తీసుకున్న ఓ నిర్ణయం అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో సంచలనం అయింది. తనకు ప్రభుత్వం కేటాయించిన భవనాన్ని వద్దని తన ఇంటినే క్యాంప్ కార్యాలయంగా మార్చుకుంటాను అంటూ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ రాసారు.

  • Written By:
  • Publish Date - September 13, 2024 / 05:54 PM IST

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తీసుకున్న ఓ నిర్ణయం అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రభుత్వ వర్గాల్లో సంచలనం అయింది. తనకు ప్రభుత్వం కేటాయించిన భవనాన్ని వద్దని తన ఇంటినే క్యాంప్ కార్యాలయంగా మార్చుకుంటాను అంటూ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ రాసారు. తనకు కేటాయించిన భవనాన్ని, అలాగే అందులోని ఫర్నీచర్ ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. అలాగే తనకు భవనం కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

దీని వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. పవన్ కు కేటాయించిన భవనం గతంలో పలువురు మంత్రులు వినియోగించారు. దేవినేని ఉమా జలవనరుల శాఖా మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే బొత్సా సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు అదే భవనం వినియోగించారు. ఉప ముఖ్యమంత్రి కావడం పలు కీలక శాఖలకు పవన్ మంత్రి కావడంతో ఆ కార్యాలయం విశాలంగా ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కు కేటాయించారు చంద్రబాబు. కాని అది వద్దని, తన ఇంటినే క్యాంప్ కార్యాలయంగా మార్చుకుంటాను అంటూ పవన్ ప్రకటించారు.

సాధారణంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు… తమ ఇంట్లో కొన్ని కార్యాకలాపాలను ఇష్టపడరు… జగన్ తాడేపల్లి నివాసం మాదిరిగా ఇల్లు పెద్దగా ఉంటే మాత్రమే వివిధ విభాగాలు సెట్ చేసి అందులో నుంచి కొన్ని కార్యాకలాపాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తమకు కేటాయించిన వసతులను పక్కాగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. కాని పవన్ మాత్రం కక్కుర్తి పడలేదు. క్యాంపు కార్యాలయంతో పాటుగా తనకు కేటాయించిన ఫర్నీచర్ కూడా వద్దు తీసుకోమని లేఖలో పేర్కొన్నారు.

తన ఇంట్లోనే క్యాంపు ఆఫీస్ సెట్ చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వహిస్తా అంటూ హుందాగా లేఖ రాసాడు పవన్. ఇప్పటికే తన ఇంట్లో సొంత ఖర్చుతో చాంబర్లను కూడా పవన్ ఏర్పాటు చేయించడం విశేషం. దీని ద్వారా ప్రతీ ఏటా దాదాపు కోటి రూపాయల ఖర్చుని ప్రభుత్వానికి భారం తగ్గించడమే కాకుండా తనకు కేటాయించిన ఫర్నీచర్ ను ఇతర మంత్రులకు వినియోగించే అవకాశం ఉంటుంది. కరెంట్ బిల్, ఇంటర్నెట్ ఖర్చులు, అద్దె సహా ఎన్నో పవన్ ఆదా చేసినట్టే అవుతుంది. తాను క్యాంపు ఆఫీసుకి వెళ్ళాలి అంటే… కనీసం 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఉప ముఖ్యమంత్రి కావడం అటవీ శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా కీలక శాఖలు పవన్ వద్ద ఉన్నాయి. పవన్ క్యాంపు ఆఫీసుకి వస్తున్నారంటే ఆ శాఖల అధికారులు అందరూ అక్కడికే రావాల్సి ఉంటుంది. దానికి తోడు పవన్ కు ఓ కాన్వాయ్ కూడా ఉంటుంది. పోలీసులు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ సమస్యలు ఇలా ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూసుకుంటే ఏటా కోటి నుంచి రెండు కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. అదే తన ఇంట్లోనే క్యాంపు ఆఫీసు పెట్టుకుంటే ఈ ఖర్చు వృధా కాకుండా ఆపే అవకాశం ఉంటుంది.

అటు జనసేన పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉంటుంది. జనసేన పార్టీ కార్యాలయం కూడా తన ఇంటి దగ్గరే ఉంది. తనకు ఖర్చు పెట్టుకునే స్తోమత ఉంది కాబట్టి ప్రభుత్వం కల్పించిన వసతులు వద్దని హుందాగా వ్యవహరించాడు పవర్ స్టార్. గతంలో ఫర్నీచర్ కోసం కక్కుర్తి పడిన నాయకులు చాలా మందే ఉన్నారు. కాని తనకు కుర్చీ కూడా ప్రభుత్వం నుంచి వద్దని పవన్ నిర్ణయం తీసుకోవడం చాలా మందికి చెంపపెట్టులాంటిదే. పవన్ తరహాలోనే స్తోమత ఉన్న మంత్రులు అందరూ ఫాలో అయితే మాత్రం ప్రభుత్వంపై గౌరవం పెరగడం ఖాయం.