సినీ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ పుష్ప అయితే టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి పుష్ప అయిపోయారు. ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తారోనని ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతోంది. రేవంత్ ను లైట్ తీసుకున్న సినిమా పెద్దలు ఇప్పుడు భయంతో గజగజలాడిపోతున్నారు. పవరున్నోడితే పెట్టుకుంటో ఏమవుతుందో ఇప్పుడు తెలిసొచ్చింది. మొన్న నాగార్జున… నిన్న మోహన్ బాబు… నేడు అల్లు అర్జున్.. మరి నెక్స్ట్ ఎవరో….!
గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి సీఎం ఆయనకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా… ఆయనెవరో మాకు తెలియదు అంటే ఇలాగే ఉంటది. ఇదేం సినిమా కాదు పవరున్నోడితో పెట్టుకుని తట్టుకుని నిలబడటానికి. అది రీల్.. ఇది రియల్… సినిమాలున్నాయి, మాకు అభిమానులున్నారు మేం అందరిలాంటోళ్లం కాదని విర్రవీగితే ఇలాగే నేలకు దించుతారు. దించుతారేంటి ఆల్ రెడీ దించేశారు… వాళ్లు కేజీల్లో అవమానం చేస్తే రేవంత్ రెడ్డి తన పవరేంటో టన్నుల్లో చూపించారు.
తగ్గేదేలే అంటే తాటతీస్తా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ ఎపిసోడ్ తో టాలీవుడ్ కు ట్రైలర్ చూపించారు. అట్టుంటది మనతోటి అంటూ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేటర్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ అరెస్టయ్యారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించడం వెంటనే చంచల్ గూడకు తరలించడం, ఈ లోపు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగిపోయింది. దేవుడు వరమిస్తే సరిపోతుందా పూజారి కూడా ఇవ్వాలికదా…! బెయిల్ వచ్చినా అది సరిలేదు ఇది సరిలేదు అంటూ రీల్ పుష్పకు రియల్ జైలు ఎక్స్ పీరియన్స్ చవిచూపించారు. ఓ రాత్రంతా జైల్లోనే ఉంచి ఖైదీ నెంబర్ 7697 కేటాయించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ ను ఒక్కపూట కూడా జైల్లో ఉంచకూడదని ఆయన లాయర్లు భావించినా కుదరలేదు.
సినీ ఇండస్ట్రీకి పుష్ప కలెక్షన్ ఫీవర్ పట్టుకుంటే టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి ఫియర్ పట్టుకుంది. సాధారణంగా సినిమావాళ్లంటే ప్రభుత్వాలు కాస్త సాఫ్ట్ గానే వ్యవహరిస్తాయి. అలాగే మూవీ ఇండస్ట్రీలు ప్రభుత్వాలతో మంచిగానే ఉంటాయి. ఎవరి లెక్కలు వారివి. అయితే ఇక్కడ మాత్రం టాలీవుడ్ లెక్క తప్పింది. రేవంత్ రెడ్డితో పెట్టుకుని ఇప్పుడు అనుభవిస్తోంది. కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తలెగరేయడానికి ప్రయత్నించింది. అసలు రేవంత్ రెడ్డిని సీఎం అన్నట్లే గుర్తించలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి కూడా చాలామంది టాలీవుడ్ పెద్దలకు మనసు రాలేదు. కలిసి అభినందించిన వారిని వేళ్లలో లెక్కపెట్టొచ్చు. ప్రభుత్వాలతో పనులు చేయించుకోవడానికి ముందుండే మూవీవాళ్లు… రేవంత్ రెడ్డిని అసలు సీఎంగా గుర్తించలేదు. దీంతో ఆయనకు కాలింది. కాలితే దానికి ఎక్కడో చోట రియాక్షన్ ఉండాలి కదా…! ఇక రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నాడు కూడా అంతే చేశారు. కనీసం ఒక్క టాలీవుడ్ పెద్ద కూడా ఆయన్ను కలిసి విషెస్ తెలపలేదు. దీనిపై అప్పట్లోనే బండ్ల గణేశ్ రాద్దాంతం కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డి వీటిని లైట్ తీసుకున్నట్లు కనిపించారు. కానీ ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అప్పుడు నట్లు టైట్ చేశారు. టాలీవుడ్ కు స్క్రూ బిగించారు.
నాగార్జునతో టాలీవుడ్ కు ఫస్ట్ ట్రైలర్ రిలీజైంది. హైడ్రా ఫస్ట్ పంజా ఎన్ కన్వెన్షన్ పైనే పడింది. నాగార్జున నెత్తీనోరు మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది. ఆ తర్వాత మోహన్ బాబుపై స్ట్రోక్ పడింది. ఇంటి గొడవే అయినా అది రోడ్డుకెక్కింది. ప్రభుత్వ పెద్దలెవరూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. తాను పాన్ ఇండియా హీరో అయిపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం.. అది మర్చిపోయి ఆయనపైనే సెటైర్లు వేస్తే ఎలా…? పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఆకతాయిగా చేసిన పని రేవంత్ రెడ్డికి మండేలా చేసింది. తెలంగాణ సీఎంకు థాంక్స్ అంటూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్లు యాక్ట్ చేశారు. అంత ఎటకారం ఎందుకో మరి…! దాని ఫలితం ఒక్క రోజు జైలు. హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఓ రాత్తంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది.
టాలీవుడ్ కు రేవంత్ భయం ఇప్పుడు ఎంతలా పట్టుకుందంటే నానీలాంటి ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరూ అల్లు అర్జున్ అరెస్టును ఖండించడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. అల్లు అర్జున్ ఇంటికెళ్లి ధైర్యం చెప్పారు కానీ నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు.
గతంలో కేసీఆర్ కు టాలీవుడ్ తో మంచి సంబంధాలుండేవి. కేసీఆర్ తో సినిమావాళ్లంతా రాసుకు పూసుకు తిరిగారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే స్థాయి గౌరవం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు. అదే దొబ్బకొట్టింది. ఇంకా సీఎం కేసీఆరే అనుకుంటే ఎలా…? వాళ్లు అలా ఉంటే నేను ఇలాగే ఉంటాను అన్నట్లు ఆయన వ్యవహరించారు. సినిమా వాళ్లకు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే ప్రభుత్వ సాయం కావాలి. ప్రీమియర్ షోలు వేయాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలి. స్థలాలు కావాలన్నా, స్టూడియోలు కావాలన్నా సీఎం సాయం కావాలి. కానీ ముఖ్యమంత్రితో సామరస్యంగా ఉండటానికి మాత్రం ఒక్కరు ముందుకు రాలేదు.
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రాజకీయ పార్టీలు స్పందించిన తీరు కూడా విచిత్రంగానే ఉంది. అక్కడ తప్పు జరిగింది అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. విచారణలో భాగంగానే అరెస్ట్ చేశారు. అదే అరెస్ట్ చేయకపోతే సామాన్యుడికి ఓ న్యాయం సెలబ్రిటీకి ఓ న్యాయమా అని వీళ్లే గొంతు చించుకుంటారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే అన్యాయం, అక్రమం అంటున్నారు. అక్కడ తప్పు అల్లు అర్జున్ దే కావచ్చు లేదా పోలీసులదే కావచ్చు అది విచారణలో తేలుతుంది. కానీ పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుపోయారు. దాన్ని ఎందుకు తప్పుపట్టాలి…? కేటీఆర్, వైఎస్ జగన్ కూడా అరెస్టును ఖండించారు. వైసీపీ నేతలు దీన్ని రాజకీయం చేయడానికి తెగ కష్టపడ్డారు. నిజానికి ఇందులో రాజకీయం ఏముంది….? ప్రతీకారం ఏముంది…? నిజానికి అల్లు అర్జున్ పై పగ ఉంటే అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు తీసుకుంటారా…? ఇండియా టుడే కాన్ క్లేవ్ లో రేవంత్ కాస్త ఘాటుగానే నిలదీశారు. వాళ్లు సినిమా తీశారు డబ్బులు సంపాదించుకున్నారు… వాళ్లేమైనా ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ లో యుద్ధం చేశారా అని నిలదీశారు. రేవంత్ మాటలు వింటే అదేంటి అలా అనేసారు అనిపిస్తుంది కానీ అది నిజమే కదా..! వాళ్లేమీ సమాజ సేవ చేయట్లేదు కదా…!
అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు వైసీపీకి పరోక్షంగా సహకరించారు. ఫ్యామిలీ అంతా జై జనసేన అంటే అర్జున్ ఒక్కడే వైసీపీ వైపు నిలిచారు. అప్పట్లోనే అది పెద్ద దుమారం రేపింది. పుష్ప విడుదలకు ముందు కూడా పవన్ ఫ్యాన్స్ తో బన్నీ ఫ్యాన్స్ యుద్ధం చేశారు. అయితే అదేమీ మనసులో పెట్టుకోకుండా ఏపీలో పుష్పకు ఎంత చేయాలో అంత చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ రేవంత్ ప్రభుత్వం కూడా అంతే పద్దతిగా వ్యవహరించింది. అలాంటప్పుడు ప్రభుత్వాలతో ఎంత సఖ్యతగా ఉండాలి…? ముఖ్యమంత్రికి జీ హుజూర్ అనాల్సిన పనిలేదు. కానీ ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాలి కదా…? ఇవ్వకుండా ఇప్పుడు నాకు సాయం చేయండి అంటే ఎలా…? ఇప్పటికైనా సినిమావాళ్లు కాస్త ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ ఎపిసోడ్ కు శుభం కార్డు పడుతుంది. లేదంటే అంతే సంగతులు…!