కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి ఎదుట ఎన్నో సవాళ్లు ఉన్నాయి. బీజేపీని ఎదుర్కోవడం ఒక పెద్ద సవాల్. అయితే దీన్ని మించిన సవాల్ ఇంకొకటి ఉంది. అదే.. కూటమిలోని 28 పార్టీల మధ్య లోక్ సభ సీట్ల సర్దుబాటు. ఈ నెలాఖరులోగా సీట్ల పంపకాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ‘ఇండియన్’ ముందుకు సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో సీట్ల పంపకాలు సాఫీగా జరిగి పోయే అవకాశాలు ఉండగా.. ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్రక్రియపై అభిప్రాయబేధాలు తలెత్తే రిస్క్. ఉందని పొలిటికల్ అనలిస్ట్ అభిప్రాయపడుతున్నారు. అలాంటి చోట్ల ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కూటమిలోని పార్టీలు ఏం చేస్తారనేది కీలకమైన అంశంగా మారనుందని చెబుతున్నారు.
‘వన్ సీట్.. వన్ క్యాండిడేట్’ .. వర్క్ ఔట్ అవుతుందా ?
‘వన్ సీట్.. వన్ క్యాండిడేట్’ ఫార్ములాతో ‘ఇండియా’ కూటమి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.ఢిల్లీ స్థాయిలో విపక్ష పార్టీలు ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదిరేనా.. గల్లీ స్థాయిలో కూటమిలోని పార్టీలన్నీ సయోధ్యను సాధించగలుగుతాయా.. ? అనే పెద్ద ప్రశ్న ఉదయిస్తోందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. గత వారమే బెంగాల్ లో జరిగిన ధూప్‌గురి అసెంబ్లీ బైపోల్ లో ఇండియా కూటమిలోని మూడు పార్టీలు రెండుగా చీలిపోయి ఒకదానిపై ఇంకొకటి పోటీ చేశాయి. కాంగ్రెస్, సీపీఎం సంయుక్తంగా పోటీ చేయగా, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. ఈ బైపోల్ లో తృణమూల్ కాంగ్రెస్ గెలవనైతే గెలిచింది. కానీ రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 4,300 ఓట్ల దూరంలో బీజేపీ అభ్యర్థి నిలిచారు. ఇండియా కూటమిలోని పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలిక వల్ల బీజేపీ అభ్యర్ధి విజయావకాశాలకు ఎంతగా చేరువయ్యాడో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్క బైపోల్ స్థానం విషయంలోనే ఇండియా కూటమికి ఏకాభిప్రాయానికి రాలేకపోయింది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. వచ్చే పోల్స్ లో 42 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్, వామపక్షాలతో సీట్ల సర్దుబాటుకు అంగీకరిస్తారా ? లేదా? అనేది పెద్ద సస్పెన్స్.
ఈ రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కుదురుతుందా ?
పంజాబ్‌లో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అయితే అక్కడ మొత్తం 13 లోక్ సభ స్థానాల్లో 8 కాంగ్రెస్ ఖాతాలో, 1 ఆప్ ఖాతాలో ఉన్నాయి. అసెంబ్లీలో ఆప్ కు బలం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడి 13 లోక్ సభ సీట్ల సర్దుబాటు విషయంలో ఆప్, కాంగ్రెస్ ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఆప్ కు ప్రస్తుతం ఒక్కటే లోక్ సభ సీటు ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో అది దాదాపు ఐదు నుంచి ఆరు స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. దీనికి కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనే దానిపై సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆధారపడి ఉంటుంది. ఇక ఢిల్లీలోనూ ఆప్ అధికారంలో ఉంది. అయితే అక్కడి మొత్తం 7 లోక్ సభ స్థానాలు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నాయి. దీంతో ఆ ఏడు స్థానాల్లో సీట్లను కాంగ్రెస్, ఆప్ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. పంజాబ్ తో పోలిస్తే ఢిల్లీలో సీట్ల పంపకాలు ఈజీగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక గుజరాత్ లోనూ 26కు 26 సీట్లు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇక్కడ కూడా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. అయితే ఈ రాష్ట్రంలో బలమైన క్యాడర్ మాత్రం కాంగ్రెస్ కే ఉంది. గతంలో గుజరాత్ ను దశాబ్దాల తరబడి పాలించిన చరిత్ర గుజరాత్ కాంగ్రెస్ కు ఉంది.ఈ నేపథ్యంలో ఇక్కడ ఆప్ కు ఒకటి, రెండుకు మించి స్థానాలు ఇచ్చేందుకు హస్తం పార్టీ మొగ్గుచూపకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు మిత్ర పక్షాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడమే లక్ష్యంగా ఇండియా కూటమికి చెందిన సమన్వయ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.