ఎయ్…మందెయ్…చిందెయ్, ఏపీలో మందుబాబులకు ఇక పండగే

ఏపీకి లిక్కర్‌ కిక్కు ఫుల్లుగా ఎక్కింది. ఇక తాగడం తూగడమే... కోరుకున్న బ్రాండ్లు... కావాల్సినంత మందు.. ఇంకేంటి మందేయండి.. చిందేయండి. ట్యాక్స్‌పేయర్స్‌కే కాదు ఏపీ ఖజానాకు కూడా బోలెడంత కిక్కు ఎక్కబోతోంది. మద్యంపై ఎన్నడూ రానంత ఆదాయం చూడబోతోంది ఏపీ సర్కార్... జనానికి ఎంత తాగిస్తే ప్రభుత్వానికి అంత కిక్కన్నమాట

  • Written By:
  • Publish Date - October 16, 2024 / 11:16 AM IST

ఏపీకి లిక్కర్‌ కిక్కు ఫుల్లుగా ఎక్కింది. ఇక తాగడం తూగడమే… కోరుకున్న బ్రాండ్లు… కావాల్సినంత మందు.. ఇంకేంటి మందేయండి.. చిందేయండి. ట్యాక్స్‌పేయర్స్‌కే కాదు ఏపీ ఖజానాకు కూడా బోలెడంత కిక్కు ఎక్కబోతోంది. మద్యంపై ఎన్నడూ రానంత ఆదాయం చూడబోతోంది ఏపీ సర్కార్… జనానికి ఎంత తాగిస్తే ప్రభుత్వానికి అంత కిక్కన్నమాట

మందు కొట్టని వాడు మహనీయుడు… మందుకొట్టేవాడు మన దేవుడు అంటోంది ఏపీ సర్కార్… ఈసారి భారీ మద్యం ఆదాయంపై కన్నేసింది. ఏపీలో మద్యం షాపుల కేటాయింపు పూర్తైంది. ప్రభుత్వ లిక్కర్ షాపులు మూతబడి ప్రైవేటు షాపుల్లో మద్యం అందుబాటులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఏపీలో మాయమైన బ్రాండ్లతో షాపులు కళకళలాడనున్నాయి. మందుబాబుల మొహాలు వెలిగిపోతున్నాయి. జగన్ సర్కార్ ఫేమస్ బ్రాండ్లను ఆపేసి జే బ్రాండ్లతో మందుబాబుల కిక్కుపై కొట్టింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మళ్లీ పాత బ్రాండ్లను మార్కెట్‌లోకి తెచ్చి వారికి ఊపు తెచ్చింది.

ఏపీలో ఈసారి మద్యంపై భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. మద్యం షాపులకోసం వచ్చిన అప్లికే।షన్లే ఇందుకు నిదర్శనం. 90వేల అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం ఈసారి దుకాణాల సంఖ్యను తగ్గించింది. అయినా దరఖాస్తులు మాత్రం పెరిగిపోయాయి. ఎక్కడో చోట షాపు వస్తే చాలన్నట్లు టెండర్లు వేసేశారు. విదేశాల్లో ఉన్నవారు కూడా అప్లికేషన్లు వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో మద్యం వ్యాపారంపై నమ్మకం ఉందో. ఏపీలో 2017-19 మధ్య 4వేల377।షాపులుండేవి. ఈసారి వాటిని 3వేల 396కు పరిమితం చేశారు. అంటే షాపుల సంఖ్య 22శాతం తగ్గింది. కానీ మద్యం దరఖాస్తులు ఏకంగా 18శాతం పెరిగాయి. షాపులు తగ్గినా మనకు రాదులే అని ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అలాగే అప్లికేషన్ రుసుము పెంచినా కూడా తగ్గేదే లే అన్నారు. ఈసారి మహిళలు కూడా పెద్దసంఖ్యలో లాటరీలో పాల్గొన్నారు. ఇక అప్లికేషన్ల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 18వందల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ స్థాయి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊహించలేదు. అధికారపార్టీ నాయకులు షాపుల కోసం అప్లికే।షన్లు వేయకుండా కొన్నిచోట్ల బెదిరింపులకు దిగారు. అది లేకుంటే అప్లికేషన్ల ఆదాయమే ఏకంగా 2వేల కోట్ల రూపాయలు దాటేదని అంచనా వేస్తున్నారు.

మద్యం అమ్మకాలపై కూడా భారీ ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పాలసీలో మార్పుల కారణంగా ఈసారి ఎక్కువ ఆదాయం వస్తుందన్నది ప్రభుత్వ ఆలోచన. 2017-19 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై 14వందల 22కోట్ల ఆదాయం వచ్చింది. కానీ రానున్న రెండేళ్లలో ఆదాయం ఏకంగా 6వేల 384 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఆరేళ్ల క్రితంతో పోల్చితే మద్యం ఆదాయం దాదాపు 349శాతం పెరిగినట్లు. మద్యం వ్యాపారులు ప్రాంతాన్ని బట్టి సంవత్సరానికి ఒక్కో షాపుకు 50 నుంచి 85లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండో ఏడాది అదనంగా మరో 10శాతం చెల్లించాలి. ఏడాదికి ఆరు విడతల్లో ఈ లైసెన్స్ ఫీజు చెల్లించాలి. మద్యం వ్యాపారులు ఇప్పటికే కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. ఇవి కాకుండా విజయవాడ, కర్నూలు, విశాఖ, కాకినాడ రాజమండ్రి వంటి ప్రాంతాల్లో 12ప్రీమియం స్టోర్లను కూడా ఏర్పాటు చేస్తారు. వీటికి లైసెన్స్ ఫీజు ఏడాదికి కోటి రూపాయలు, ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. అంతేకాదు మద్యంపై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మద్యంపై రెండు శాతం సెస్సు విధించింది. సెస్ ద్వారా ఏడాదికి మరో వంద కోట్లు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

గతంలో వైసీపీ సర్కార్ మద్యం రేట్లను భారీగా పెంచింది. మద్య వినియోగం తగ్గించడానికే ఈ నిర్ణయం అని చెబుతూ రేట్లు వడ్డించింది. దీంతో తాగుబోతులు కష్టమైనా సరే ఎక్కువ మొత్తం చెల్లించి మందు కొనుగోలు చేశారు. చీప్ లిక్కర్ కూడా 130-140 రూపాయల వరకు ఉండేది. అది కూడా అనామక బ్రాండ్లే. కానీ ఇప్పుడు ఏపీ సర్కార్ బ్రాండెడ్ కంపెనీల చీఫ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అది కూడా 99రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతారు. రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించేది చీప్ లిక్కరే. ఇప్పుడు వాటి రేట్లు తగ్గించడంతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పైగా వైసీపీ సర్కార్ అసలు డిజిటల్ పేమెంట్లు అంగీకరించేది కాదు. అయితే ఇకపై లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్లు జరుగుతాయి. అలాగే ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మందు అందుబాటులో ఉంటుంది. అంటే ఇక ఏపీ మందుబాబులు ఎంత తాగితే అంత అన్నమాట… నో లిమిట్ ఇక మందేయండి చిందేయండి..

రాష్ట్రంలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటం, అది కూడా క్వాలిటీ లేని సరుకు కావడంతో అమ్మకాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు 2019కి ముందు నాటి బ్రాండ్లతో పాటు మరికొన్ని కొత్త బ్రాండ్లు కూడా మార్కెట్ లోకి దించింది. దీని కారణంగా మద్యం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక బెల్టు షాపులు కూడా ఎలాగూ ఉంటాయి కాబట్టి మందుబాబులకు ఏ మాత్రం కిక్కు తగ్గే అవకాశాలుండవు. పైగా పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ తగ్గుతుందని కూడా భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ, కర్ణాటక నుంచి భారీగా మద్యం దొడ్డిదారిన రాష్ట్రంలోకి ప్రవేశించేది. దూరంగా ఉన్న గోవా నుంచి కూడా మందు తెప్పించేవారు. ఇప్పుడు ఇక్కడే రేట్లు తగ్గించడం, నాణ్యమైన మందు అందుబాటులో ఉంటుంది కాబట్టి మద్యం అమ్మకాలు పెరుగుతాయని మరో అంచనా.

నిజానికి రేట్లు భారీగా పెంచడంతో ఏపీలో మద్యం వినియోగం తగ్గింది. కానీ లాభాలు మాత్రం పెరిగాయి. 2018-19నాటికి ఏపీలో మద్యం అమ్మకాలు ఏడాదికి రూ.20,128 కోట్లు. కానీ అది 2023-24 నాటికి దాదాపు 30వేల కోట్లకు చేరింది. అయితే బీరు అమ్మకం దాదాపు సగానికి పడిపోయింది. అలాగే ఐఎంఎల్ అమ్మకాలు కూడా ఏడాదికి దాదాపు 50లక్షల కేసులు తగ్గిపోయాయి. ఇప్పుడు మద్యం రేట్లు తగ్గించి పాత బ్రాండ్లు తీసుకురావడంతో వినియోగం ఆ స్థాయికి చేరుతుందన్నది ప్రభుత్వ అంచనా. ఇది నిజంగా ప్రభుత్వానికి మంచి కిక్కిచ్చే వార్తే.
అసలే ఆర్ధిక సమస్యల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మద్యం ఆదాయంతో ఖుషీ చేసుకుంటోంది. భలే మంచి మందు బేరం అని పాడుకుంటోంది.