దేశం గర్వించే దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా అంత్యక్రియలను ముంబైలో ప్రభుత్వ లాంచనాలతో కుటుంబ సభ్యులు నిర్వహించారు. అంత్యక్రియలకు దేశ విదేశాల నుంచి వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరై ఓ గొప్ప మానవతావాదికి కన్నీటి వీడ్కోలు పలికారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరు అయ్యారు. ఏపీ సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్… రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అటు మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా భరత మాత ముద్దు బిడ్డకు చివరి మజిలీని నిర్వహించింది.
అయితే రతన్ టాటా పార్సీ కమ్యూనిటీ చెందిన వ్యక్తి. ఆ కమ్యూనిటీ అనుసరించేది జొరాస్ట్రియన్ మతం. రతన్ టాటా కూడా ఆ మతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన అంత్యక్రియలు ఎలా జరుగుతాయి అనేది చాలా మందిలో ఉన్న సందేహం. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలలో అంత్యక్రియలు సాధారణంగా పూడ్చి పెట్టడం లేదా దహనం చేయడం జరుగుతుంది. కాని ఇది పార్సీలలో భిన్నంగా ఉంటుంది. పార్సీల స్మశానవాటికను దఖ్మా లేదా టవర్ ఆఫ్ సైలెన్స్ అని పిలుస్తారు. 3 వేల ఏళ్ళ నాటి నుంచి ఈ సాంప్రదాయం పార్సీలు అనుసరిస్తున్నారు.
టవర్ ఆఫ్ సైలెన్స్ వృత్తాకార బోలు భవనం మాదిరిగా ఉంటుంది. ఎవరైనా మరణిస్తే వారి భౌతిక కాయాన్ని శుద్ధి చేసి అనంతరం ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో బహిరంగ ప్రదేశంలో విడిచిపెడతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని దోఖ్మెనాషిని అని పిలుస్తారు. అంటే మృతదేహాన్ని ఆకాశంలో ఖననం చేయడం. అప్పుడు సూర్యరశ్మికి, మాంసాహార పక్షులకు ఆ శరీరం ఆహారంగా మారుతుంది. అంటే చావు కూడా ఓ దానంగా ఉండాలనేది వారి భావన. బౌద్ద మతంలో కూడా ఇలాగే చేస్తారు. వారి మృతదేహాలను రాబందులు వచ్చి తింటాయి.
అయితే ఇప్పుడు రాబందులు, లేదా ఖాళీ ప్రదేశాలు చాలా తగ్గిపోయాయి. అందుకే పార్సీలు ఈ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమకు కూడా ఓ స్మశాన వాటిక ఉండాలని భావించి నిర్మించారు. ఇక జొరాస్ట్రియన్ మతానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ రతన్ టాటా అంత్యక్రియలు మాత్రం ఇతర మతాల మాదిరిగానే జరిగాయి. రతన్ టాటా అంత్యక్రియలను దహన సంస్కారాలతో పూర్తి చేసారు. 2022 లో మరణించిన సైరస్ మిస్త్రీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అన్ని పార్శీ అంత్యక్రియలలో 15 నుండి 20% వరకు శ్మశాన వాటికలలోనే నిర్వహిస్తున్నారు.