తెలంగాణలో సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రవళిక ఆత్మహత్యకు ఓ వ్యక్తి కారణమంటూ ప్రవళిక తల్లి సంచలన ఆరోపణలు చేసింది. శివరామ్ అనే యువకుడి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ చెప్పింది. చాలా కాలంగా శివరామ్ ప్రవళికను వేధిస్తున్నాడంటూ చెప్పింది ప్రవళిక తల్లి. అతనికి కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నట్టు చెప్పింది. తన కూతురు చావును రాజకీయాలకు వాడుకోవొద్దంటూ అధికార ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేసింది.
ప్రవళిక తల్లి చేసిన ఈ కామెంట్స్‌తో ఈ కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. గ్రూప్స్ వరుసగా వాయిదా పడటం కారణంగానే ప్రవళిక చనిపోయిందంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందు నుంచీ ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందంటూ ఆరోపణలు రావడంతో ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ప్రవళిక ఆత్మహత్యకు భిన్న కారణాలు వినిపిస్తున్నాయి. పరీక్షలు వాయిదా పడ్డ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రతిపక్షాలు అంటుంటే.. ప్రేమ వ్యవహారం కారణమని పోలీసులు చెప్తున్నారు.
ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చిన చెప్తున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ప్రవళిక తల్లి చేసిన ఆరోపణతో ఒక్కసారిగా కేసు మలుపు తిరిగింది. అయితే అధికార పార్టీ నేతలే ప్రవళిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు నిన్నటి వరకూ ఆరోపించారు. ప్రభుత్వంపై పడ్డ మచ్చను తొలగించుకునేందుకు అమ్మాయికి ప్రేమ వ్యవహారాలు అంటగడుతున్నారంటూ మండిపడ్డారు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రవళిక తల్లే ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.