మళ్ళీ పవన్ తోనే ప్రయాణం: బాబు కీలక వ్యాఖ్యలు

కూటమి పార్టీల సమన్వయంపై ఏపీ సిఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. 2029లో వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇదే కూటమి కొనసాగనుందని స్పష్టత ఇచ్చేసారు.

  • Written By:
  • Publish Date - October 18, 2024 / 02:55 PM IST

కూటమి పార్టీల సమన్వయంపై ఏపీ సిఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. 2029లో వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇదే కూటమి కొనసాగనుందని స్పష్టత ఇచ్చేసారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న 29 నియోజకవర్గాలనూ కాపాడుకోవాల్సి ఉందని తేల్చి చెప్పారు. పార్టీ ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కూటమి పార్టీల నేతలపై కీలక వ్యాఖ్యలు చేసారు.

ఎన్నికలు ఐపోయాయి, ఇక కూటమి పార్టీలతో పని లేదని అనుకోవద్దని నేతలకు సూచించారు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, కలిసే పని చేయాల్సి ఉంటుంది, గుర్తు పెట్టుకుని మసలుకోండని నేతలకు దిశా నిర్దేశం చేసారు. అధికారంలోకి వచ్చిన 125 రోజుల తర్వాత పార్టీ భవిష్యత్ ప్రణాళిక చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు ఆయన. కూటమి పార్టీల మధ్య సమన్వయం తో పాటు ప్రజల అంచనాలను అందుకోవాలని నేతలకు స్పష్టం చేసారు. అదే సమయంలో పార్టీని కంటికి రెప్పలా కాపాడే పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నారు.

ఎన్ డీ ఏ ముఖ్యమంత్రుల సమావేశం లో ప్రధాని ఐదు గంటలు కూర్చున్నారని… అంటే వచ్చే ఎన్నికలకు ఆయన సిద్ధమౌతున్నారన్నారు. అందుకే ఆయన అంకిత భావాన్ని చూసి అందరం స్ఫూర్తి పొందాలని చెప్పాను అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. ప్రజా సంక్షేమం తప్ప వేరే ఆలోచన మోడీ కి లేదు కాబట్టే ఈ స్థాయిలో బీజేపీ బలపడిందన్నారు. బీజేపీ ఎలా శక్తి వంతమైన పార్టీగా ఎదిగిందో టీడీపీ కూడా ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉందన్నారు సీఎం.