Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన బెంచ్ ఎదుట మంగళవారం వాదనలు ముగిశాయి. ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న బెంచ్ తీర్పును వాయిదా వేసింది.
ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తించదని, ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ కాకూడదని సీఐడీ తరఫున రోహత్గీ వాదించారు. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్స్ కూడా నమోదయ్యాయని, వాటిపై కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని రోహత్గీ కోర్టుకు తెలిపారు. అవినీతి ఆరోపణలున్నప్పుడు సెక్షన్ 422 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేమని, ఆరోపణలున్నప్పుడు చార్జిషీట్లు వేసి, విచారణ జరిపి, అవసరమైతే శిక్షలు కూడా విధించవచ్చని కోర్టుకు తెలిపారు రోహత్గీ. దీనిపై స్పందించిన బెంచ్.. ఆరోపణలపై అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎంతోమందిని విచారించినప్పటికీ, ఒక్కరికి కూడా సెక్షన్ 17ఏ ప్రకారం అనుమతి తీసుకోలేదని, ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. చట్టసవరణను ముందు నుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను ఉటంకించారు.
2019 నాటి ‘శాంతి కండక్టర్స్’ కేసు, 1964నాటి రతన్‌లాల్ కేసును ప్రస్తావించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ చట్టం కింద రక్షణ ఉంటుందని, రాజకీయ కక్ష సాధింపులు లేకుండానే ఈ సెక్షన్ తీసుకు వచ్చారని, ఎన్నికలకు ముందు ఈ తరహా రాజకీయ సాక్ష సాధింపులు సాధారణంగానే ఉంటాయని సాల్వే అన్నారు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. వచ్చే శుక్రవారం లేదా ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉంది.