Special Parliament : ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు.. అందుకోసమేనా ?

ప్రధాని మోడీ ప్రభుత్వ పదవీకాలం కొన్నినెలల్లో ముగియనుంది. దీంతో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను ఇంకా ఎక్కువ రోజులు సాగదీయడం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికలపై క్లారిటీ వస్తే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీపైనా బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.

ఇప్పుడు యావత్ దేశం దృష్టి.. స్పెషల్ పార్లమెంట్ సెషన్ పైనే ఉంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ? ఏ నిర్ణయాలను ప్రకటించబోతోంది ? ఏ బిల్లులను ఆమోదించబోతోంది ? అనే దానిపై సర్వత్రా డిస్కషన్ జరుగుతోంది. అయితే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీని కేంద్రం నియమించడంతో.. ఈసారి పార్లమెంట్ సెషన్ లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును ప్రవేశపెడతారనే అంచనాలకు బలం చేకూరింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరగనున్న ఈ సెషన్ లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెడతారని భావిస్తున్నారు. క్రిమినల్‌ న్యాయవ్యవస్థకు సంబంధించి 3 కీలక బిల్లులు పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్నా యి. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రధాన న్యాయమూర్తి పాత్రలేకుండా చేసే మరో బిల్లు కూడా సిద్ధంగా ఉంది. ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన ఉండనే ఉంది. అయితే ఈ స్పెషల్ సెషన్ లో జీ20 శిఖరాగ్ర సదస్సు, 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలపై మాత్రమే చర్చ జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. అక్టోబరులో ఢిల్లీలో జరగనున్న పీ-20 సదస్సు (G20 దేశాల పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌ల సమావేశం) కోసం ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తారని చెబుతున్నారు. పీ-20 సదస్సుకు 30కి పైగా దేశాల పార్లమెంట్ స్పీకర్లు హాజరు కానున్నారు.

రాజకీయ లబ్ధి కోసమేనా ?

ప్రధాని మోడీ ప్రభుత్వ పదవీకాలం కొన్నినెలల్లో ముగియనుంది. దీంతో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను ఇంకా ఎక్కువ రోజులు సాగదీయడం సరికాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికలపై క్లారిటీ వస్తే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీపైనా బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయం రాజకీయంగానూ బీజేపీకి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రతిపక్షాలను సులువుగా ఓడించవచ్చని కమలం నేతలు నమ్ముతున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మధ్య తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత వచ్చే ఏడాది మే-జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం కనుక జమిలి ఎన్నికల ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును తీసుకొస్తే లోక్‌సభ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు వీలవుతుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటుంది.

గతంలో పార్లమెంటు స్పెషల్ సెషన్స్ ఎప్పుడు జరిగాయి ?

గతంలో ఈవిధంగా జరిగిన స్పెషల్ పార్లమెంట్ సమావేశాల వివరాల్లోకి వెళితే.. క్విట్ ఇండియా ఉద్యమం 50వ వార్షికోత్సవం సందర్భంగా 1992 ఆగస్టు 9న అర్ధరాత్రి భారత పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. 2002లో బీజేపీ నాయకత్వంలోని తాత్కాలిక ఎన్డీయే ప్రభుత్వం మార్చి 26న ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఉగ్రవాద నిరోధక బిల్లును ఆమోదించింది. ఎందుకంటే అప్పట్లో ఎన్డీయే కూటమికి రాజ్యసభలో బిల్లుల్ని ఆమోదించుకోగలిగినంత మెజారిటీ లేదు. 2015 నవంబర్ 26న బీ ఆర్ అంబేద్కర్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆ ఏడాది దేశవ్యాప్తంగా అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ అదే ఏడాది నిర్ణయం తీసుకున్నారు. మోడీ ప్రభుత్వం ఇంతకు ముందు 2017 జూన్ 30న వస్తు, సేవల (జీఎస్టీ) బిల్లును అమలు చేసేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.