టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందా..? అబ్బాయ్‌కి బాబాయ్ చెక్ పెడుతున్నారా…? మరి అబ్బాయ్ దీనికి ఏం కౌంటర్ వేయబోతున్నారు.
ఏపీ రాజకీయాల్లో కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం గురించి తెలియని వారుండరు. ఎర్రన్నాయుడు టీడీపీలో చక్రం తిప్పారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్‌నాయుడు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అచ్చెన్న ఎమ్మెల్యేగా ఉంటే రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. జగన్ వేవ్‌లోనూ 2019లో ఈ ఇద్దరూ విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నా..ఉన్నట్లు కనిపించినా ఇప్పుడు ఆ ఫ్యామిలీలో కోల్డ్‌వార్ నడుస్తోందనేది లేటెస్ట్ టాక్..
సొంత జిల్లాలో నెగ్గని రామ్మోహన్ నాయుడి మాట..
జిల్లాలో తన మాట అంతగా నెగ్గలేదు రామ్మోహన్ నాయుడు భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అంతా అచ్చెన్న చుట్టూ తిరుగుతుండటంతో తన పాత్ర పరిమితం అయిపోయిందని రామ్మోహననాయుడు మధన పడుతున్నారని చెబుతున్నారు. ఇలాగైతే కష్టమని.. తన ప్రాభవం పెరగాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారని సిక్కోలు పొలిటికల్ టాక్. ఢిల్లీలో ఉండటం కంటే గల్లీలో ఉంటేనే ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించగలనన్నది ఆయన ఆశ. లోకేష్ టీమ్‌లో ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారెంటీ అని రామ్మోహననాయుడు భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
అసెంబ్లీ పైనే ఆ ఎంపీ మనసు..!
నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రామ్మోహన్ నాయుడు ఆశపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు, మాజీ మంత్రి, ధర్మాన కృష్ణదాస్‌ను ఢీకొట్టాలని ఆయన తహతహలాడుతున్నారని అంటున్నారు. పైగా మారుతున్న రాజకీయ పరిణామాలతో ఏపీలో టీడీపీ గట్టిగా పుంజుకుంది. దీంతో అధికార పార్టీ నేతల్లో నమ్మకం పెరుగుతోంది.
పార్టీ పెద్దల ముందు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రపోజల్ పెట్టారు అయితే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. రామ్మోహన్ నాయుడు ఎంపీ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తన వాగ్ధాటి, చురుకుదనం మన్ననలు పొందారు. దీంతో ఆయన ఢిల్లీలో ఉంటే బాగుంటుందని పార్టీలోని ఓ వర్గం భావిస్తోందట. ఒకవేళ ఎన్‌డీఏతో పొత్తు కుదిరితే మంచి పదవే దక్కుతుందోని చెబుతున్నారు. అయినా ఎంపీ మనసు మాత్రం అసెంబ్లీపైనే ఉంది.
కింజారపు ఫ్యామిలీలో టికెట్ ఎపిసోడ్ ..?
ఎన్నికల సమయానికి కింజారపు ఫ్యామిలీలో టికెట్ ఎపిసోడ్ మరింత రక్తికట్టేలా కనిపిస్తోంది. ఒకే కుటుంబానికి రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిని రేపుతోంది. పైగా రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు సీటు ఇచ్చి రేపు పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి పదవి ఇవ్వాలని తలనొప్పి ఎందుకని పార్టీ హైకమాండ్ భావిస్తే మాత్రం సీన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ కే పరిమితం చేసే అవకాశాలు లేకపోలేదు. మరి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.