టీడీపీ తమ్ముళ్ళను ఎల్లో మీడియా మోసం చేస్తుందా…? సోషల్ మీడియాలో కథనాలనే తమ చానల్స్ లో ప్రసారం చేస్తూ మభ్య పెడుతున్నారా…? జరగని వాటిని జరిగాయని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటీ…? ఇప్పుడు ఈ ప్రశ్నలు టీడీపీ సర్కిల్స్ తో పాటుగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నాయి. తాజాగా వైసీపీ నేత దేవినేని అవినాష్ ను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కు పంపారనే కథనం ఒకటి చక్కర్లు కొట్టింది. టీడీపీ అనుకూల మీడియాలో దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి. వాటిని తెలుగు తమ్ముళ్ళు వైరల్ చేసారు.
కొన్ని న్యూస్ చానల్స్ అయితే బిగ్ బ్రేకింగ్ పేరుతో ఈ వార్తను పెద్ద ఎత్తున ప్రచారం చేసాయి. చివరికి ఇది అవాస్తవం అని తేలింది. దేవినేని అవినాష్ తన కార్యాలయంలో కూర్చుని ఒక వీడియో విడుదల చేసారు. ఇలాగే మొన్న వల్లభనేని వంశీ విషయంలో కూడా జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. కాని ఆయనను అరెస్ట్ చేసారని ఒక ఛానల్ లో కథనం వచ్చింది. నమ్మిన తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున వైరల్ చేసారు. ఇక వైసీపీకి చెందిన హరికృష్ణా రెడ్డిపై ఎవరో దాడి చేసారని వార్తలు వచ్చాయి. వాటిని నమ్మి ప్రచారం చేసారు.
తీరా చూస్తే అసలు… అతను ఇండియాలోనే లేడు అని తెలిసింది. అసలు వెనుకా ముందు ఆలోచన లేకుండా మీడియా సంస్థలు ఏ విధంగా వార్తలను ప్రభావితం చేస్తాయి అంటూ టీడీపీ తమ్ముళ్ళు తమ అనుకూల మీడియాపై మండిపడుతున్నారు. దేవినేని అవినాష్ స్టోరీనే ఒకసారి చూస్తే… ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు. అలాంటి వ్యక్తి విమానాశ్రయంలో అడుగు పెడితే అరెస్ట్ చేయడం రూల్. కాబట్టి వాళ్ళు సాహసం చేయరు. లుక్ ఔట్ నోటీసులు వస్తే తక్షణమే ఎయిర్పోర్ట్ లో ఉన్న సిఐఎస్ఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి… స్థానిక పోలీసులకు చెప్తారు.
ఆయనపై నమోదు అయిన కేసు… ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో తెలుసుకుని సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కాని… అవినాష్ ను అడ్డుకున్నారని ఆయన వెనక్కు వచ్చారని కథనాలు వండివార్చారు. దీనితో తెలుగు తమ్ముళ్ళు నమ్మేశారు. ఎయిర్పోర్ట్ లో అవినాష్ కదలికలు సీసీ టీవీ ఫూటేజ్ ఏమైనా ఉందా ఈ మీడియా చానల్స్ వద్ద అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. లుకౌట్ నోటీసులు ఉన్న వ్యక్తిని మరి విమానాశ్రయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోకపోతే అది వాళ్ళ తప్పు. వాళ్ళు రాష్ట్ర పోలీసులు కాదు… కేంద్ర బలగాలు. లుకౌట్ నోటీసులు జారీ చేస్తే పేపర్ ప్రకటన కూడా ఉంటుంది. తప్పించుకుని తిరిగితే మాత్రమే అలా చేస్తారు. కాని అవినాష్ బయట తిరుగుతున్నారు. ఇదంతా పరిశీలిస్తే అవినాష్ విషయంలో జరిగింది అంతా సొల్లు ప్రచారమే. కాబట్టి తమ్ముళ్ళు ఇలాంటివి షేర్ చేసే ముందు వెనుకా ముందు ఆలోచించుకోవడం మంచిది అని పలువురు సూచిస్తున్నారు.