Ponnala Laxmaiah: టికెట్ కోసం పొన్నాలకు ముచ్చెమటలు.. ఎందుకీ పరిస్థితి ?

మాజీ పీసీపీ పొన్నాల లక్ష్మయ్యను కలవరపెడుతున్న ఎమ్మెల్యే టికెట్.

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 06:33 PM IST

ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన ఓ వెలుగు వెలిగారు. అధిష్టానంలోని పెద్దలకు నమ్మిన బంటుగా మెలిగారు. ఒకానొక దశలో పీసీసీ చీఫ్‌గానూ పనిచేశారు. కీలక శాఖలకు మంత్రిగానూ సేవలందించి రాష్ట్ర స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారు. అలాంటి సీనియర్ కాంగ్రెస్ నేత ఇప్పుడు తన అసెంబ్లీ టికెట్ ను తాను సాధించుకునేందుకు చెమటోడుస్తున్నారు. గతంలో ఇతరులకు తనకు చైతనైనంత మాట సాయం చేసిన ఆయన ఇప్పుడు ఇతరుల హెల్ప్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కాంగ్రెస్ లో మారిన అంతర్గత రాజకీయ సమీకరణాలతో పొన్నాల లక్ష్మయ్య ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో జనగామలో ఓడిపోయిన పొన్నాల.. ఈసారి ఆ టికెట్ ఇస్తే తానేంటో నిరూపిస్తానని అంటున్నారు. కాంగ్రెస్ లోని తన పోటీదారు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి టికెట్ ఎక్కడ దక్కుతుందోనన్న కలవరంలో ఇప్పుడాయన ఉన్నారు. ఇప్పటికే జనగామ జిల్లా కాంగ్రెస్ పదవిని దక్కించుకున్న కొమ్మూరి కూడా జనగామ అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు. దీంతో పొన్నాల, కొమ్మూరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

గతంలో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని నియమించిన టైంలో.. తన సలహా తీసుకోలేదని పొన్నాల ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ టికెట్ విషయంలోనూ ఇలా ఏదైనా ఆకస్మికంగా జరగొచ్చనే భయంతో ఆయన ఉన్నారట. దీనిపై ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలోని పెద్దలకు పొన్నాల కంప్లైంట్ చేశారట. ఒకప్పుడు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని వాపోయారట. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి రికమెండేషన్ తో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి జనగామ డీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని చెప్పారట. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పొన్నాలకు సంబంధించిన నెగెటివ్ పాయింట్స్ ను చూస్తోందని తెలుస్తోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలు కావడం, వయో భారం (79 సంవత్సరాలు) అనేవి పొన్నాలకు నెగెటివ్ పాయింట్స్ అని రేవంత్ అండ్ టీమ్ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్ట్ వెళ్లిందట.

ఈనేపథ్యంలో పొన్నాల కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నెగెటివ్ పాయింట్స్ ను వెలికి తీయడంపై ఫోకస్ పెట్టారట. కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం డీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యేవారు అదే జిల్లాకు చెందిన వారై ఉండాలని, కానీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లాకు చెందినవారని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఒకవేళ జనగామ అసెంబ్లీ టికెట్ ఇచ్చినా స్థానికేతరుడు కావడం కొమ్మూరికి మైనస్ పాయింట్ గా మారుతుందని తన ఒపీనియన్ చెప్పారట. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్.. జనగామ జిల్లా ప్రెసిడెంట్ గా నియమితులైన కొమ్మూరి ప్రతాప్ ఇద్దరూ ‘రెడ్డి’ వర్గానికి చెందినవారని, తనలాంటి బీసీలకు అవకాశాలు దక్కని పరిస్థితి కాంగ్రెస్ లో ఏర్పడిందని పొన్నాల తన గోడును రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ ముందు వెళ్లబోసుకున్నారని సమాచారం. తదుపరిగా ఏం జరుగుతుంది ? జనగామ టికెట్ ఎవరికి దక్కుతుంది ? అనేది ఇంకొన్ని రోజుల్లోనే తేలిపోతుంది !!