అమెరికా అధ్యక్షుడికి వైట్‌ హౌజ్‌లో ఉండే సౌకర్యాలు ఇవే

ప్రపంచంలో అగ్ర దేశం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు అమెరికా. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అమెరికా జోక్యంతో పరిస్థితి సర్దుకుంటుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండటం అంటే.. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్నట్టే.

  • Written By:
  • Publish Date - November 7, 2024 / 10:28 PM IST

ప్రపంచంలో అగ్ర దేశం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు అమెరికా. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అమెరికా జోక్యంతో పరిస్థితి సర్దుకుంటుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండటం అంటే.. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్నట్టే. అందుకే ఆ దేశంలో జరిగే ఎన్నికలను ప్రపంచం మొత్తం గమనిస్తుంది. ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోటీ తరువాత కమళా హ్యారిస్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. త్వరలో మరోసారి అధ్యక్ష హోదాలో వైట్‌ హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడికి ప్రభుత్వం నుంచి వచ్చే జీతం ఎంత, వైట్‌ హౌజ్‌లో ఆయనకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అనే విషయాలు వైరల్‌ అవుతున్నాయి.

అమెరికాలో అధ్యక్షుడి జీతం సాధారణ పౌరుడి సగటు జీతం కంటే ఆరు రెట్లు ఎక్కువ. అతనికి ఏడాది 4.4 లక్షల డాలర్లు అందుతుంది అంటే మన కరెన్సీలో దాదాపుగా 3 కోట్ల 36 లక్షలు. ఖర్చులకు మరో 50 వేల డాలర్లు అంటే 42 లక్షలు పొందుతారు. అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్‌లో ఉచిత నివాస సదుపాయం ఉంటుంది. ఇదే కాకుండా బ్లెయిర్ హౌస్, క్యాంప్ డేవిడ్ అనే మరో 2 గెస్ట్ హౌసుల్లో బస చేయొచ్చు. ఆయన విందుల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. ప్రయాణించడానికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్, బీస్ట్ కారు అందుబాటులో ఉంటాయి. వినోదం కోసం, సిబ్బంది, వంటవారు ఇలా పలు అవసరాలకోసం ఏడాది 19 వేల డాలర్లు అంటే 16 లక్షలు అదనంగా ఇస్తారు. ఉచిత ఆరోగ్య సేవలు లభిస్తాయి.

ప్రయాణ ఖర్చుల కోసం పన్నులు వేయని లక్ష డాలర్లు అంటే మన కరెన్సీలో 84లక్షలు ఇస్తారు. ఈ వార్షిక వేతనాన్ని జార్జ్ డబ్ల్యూ బుష్ అధికారం చేపట్టడానికి ముందు 2001లో యూఎస్ కాంగ్రెస్ చివరిసారిగా పెంచింది. యూఎస్ అధ్యక్షుడిగా వైదొలిగిన తరువాత అదనపు పెన్షన్ లాంటి ఇతర ప్రోత్సాహకాలనుకూడా అందుకుంటారు. అయితే, యూఎస్ ప్రథమ మహిళలకు ఎలాంటి జీతం అందదు. యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత వైట్ హౌస్ రీమోడలింగ్ కోసం లక్ష డాలర్లు అందుకుంటారు. అయితే.. బరాక్ ఒబామా వంటి పలువురు అధ్యక్షులు ఆ డబ్బును ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు. బదులుగా వారి సొంత ఖర్చులతో వైట్ హౌస్ రీ మోడలింగ్ చేయించుకున్నారు.