నో మోర్; చంద్రబాబు తమ్ముడి హిస్టరీ ఇదే, అవమానంతో రాజకీయాలకు గుడ్ బై

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో కాసేపటి క్రితం కన్నుమూసారు

  • Written By:
  • Publish Date - November 16, 2024 / 02:17 PM IST

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో కాసేపటి క్రితం కన్నుమూసారు. అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న ఆయన గత కొన్నాళ్ళుగా ఇదే ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఇక ఆయన ఆరోగ్యం విషమించింది అనే వార్త తెలియడంతో… నారా, నందమూరి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. బాలకృష్ణ ఇప్పటికే ఆస్పత్రి వద్దకు చేరుకున్నట్టు సమాచారం.

ఇక తన బాబాయి ఆరోగ్యానికి సంబంధించి సమాచారం అందడంతో కొద్దిసేపటి క్రితం ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ బయల్దేరి వెళ్ళారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఢిల్లీ పర్యటన ను వాయిదా వేసుకుని సిఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ వస్తున్నారు. కొన్నేళ్లుగా నరాలు వ్యాధితో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు… అనారోగ్యంతో చాలా ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే హీరో నారా రోహిత్.

ఢిల్లీ పర్యటన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉన్నా… రద్దు చేసుకుని హైదరాబాద్ బయల్దేరారు చంద్రబాబు నాయుడు. ఇక నారా రామ్మూర్తి నాయుడు వ్యక్తిగత, రాజకీయ జీవితానికి వస్తే… 72 ఏళ్ళ రామ్మూర్తి నాయుడు… నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు రెండో కుమారుడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు.. ఒకరు నటుడు రోహిత్‌, మరొకరు నారా గిరీష్. 1994 లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేసారు.

99 ఎన్నికల్లో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి చేతిలో ఆయన ఓటమి పాలై… అనంతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన సొంత నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడంతో… అవమాన భారంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు చెప్తారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలు ఆయనను వెంటాడాయి. దీనితో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు తన సోదరుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఆయన పార్టీ బాధ్యతలు చూసేవారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు.

2014 లో చంద్రబాబు తిరిగి సిఎం కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని వార్తలు వచ్చినా… రామ్మూర్తి నాయుడు మాత్రం ఆసక్తి చూపించలేదు. రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడటంతో… నారా రోహిత్… సినిమాలకు కూడా దూరం అయ్యారు అనే ప్రచారం జరిగింది. ఇటీవలే రోహిత్ నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే కొడుకు పెళ్లి చూడకుండానే రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం రోహిత్ వివాహం, కుటుంబ బాధ్యతలను నారా భువనేశ్వరి చూస్తున్నారు. రోహిత్ వివాహం విషయంలో కూడా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు భువనేశ్వరి.