ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు చూస్తే జాతీయ పార్టీలు ఒకరికొకరు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. మన్నటి వరకూ టీం ఇండియాలో 4వ స్థానం కోసం పోటీ పడ్డారు కొందరు ఆటగాళ్లు. కానీ ఇక్కడ రాజకీయంగా పార్టీని నిలబెట్టడం కోసం తపన పడుతున్నారు నాయకులు. కేవలం ఒక్కరోజు వ్యవధిలో రెండు పార్టీలు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం వెనుక అసలు వ్యూహం ఇదే. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషర్ అనే పథకం పేరు చెబితే.. బీజేపీ రైతు డిక్లరేషన్ అని మరో పథకంపేరు చెబుతూ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీరిలో ఎవరు సక్రమంగా అమలు చేస్తారో ఎన్నికలు జరిగి అందులో వీరిలో ఎవరో ఒకరు గెలిచేంత వరకూ వేచి చూడాలి.
రైతు డిక్లరేషన్ ఒట్టిమాటలే
రైతులకు కేసీఆర్ సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే మేము రైతుల కోసం అండగా ఉంటామని ఈ సభను ఏర్పాటు చేశారు. రైతు గోస.. బీజేపీ భరోసా అంటూ సినిమా టైటిల్స్ పెట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు తప్ప చేతల్లో చూపించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అలాగే గతంలో హర్యానా, పంజాబ్, ఢిల్లీ రైతుల దీక్షలను కూడా పట్టించకోని ప్రభుత్వం ఇప్పుడు రైతుల కన్నీరు తుడుస్తామంటూ ప్రగల్బాలు పలుకుతోందని అందరికీ తెలిసిపోయనట్లుంది. పైగా గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి తీవ్రమైన వ్యతిరేఖత మూటగట్టుకున్న విషయం మరిచి ఇలాంటి హామీలు ఇస్తే రైతులు నమ్ముతారనుకోవడం బీజేపీ మూర్ఖత్వమే అవుతుందంటున్నారు రాజకీయ పండితులు. పైగా సభలో ఎక్కడా రైతుల ప్రస్తావనే తీసుకురాలేదు. సరైన హామీ ఒక్కటీ రైతుల మీద చేయలేదు. ఊరికే రైతు డిక్లరేషన్ పేరుతో సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పైగా కేంద్రం ఏదైనా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసే ముందు కేంద్రంలో ఉండి ఆచరణ చేసి చూపించాల్సి ఉంటుంది. ఈ కారణంగా హామీ ఇచ్చి లేని పోని భారం ఎందుకు తలపై వేసుకోవడం అని అమిత్ షా భావించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ను అధిగమించడమే బీజేపీ లక్ష్యమా
తెలంగాణలో మూడు రాజకీయ పార్టీలు అధికారం కోసం హమీ తుమీ అని పోటీ పడుతున్నాయి. అందులో మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంటే రెండవ స్ధానంలో కాంగ్రెస్ పాగా వేసింది. గతంలో బీజేపీ రెండవ స్థానంలో ఉండేది. కానీ ప్రస్తుతం మూడవ స్థానంలో కూడా కింద స్థాయికి పడిపోయిందని చెప్పడానికి గతంలో జరిగిన కొన్ని ఉదంతాలే నిదర్శనం. పైగా కొందరు పార్టీ వీడి బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో సభ నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసభకు చాలా మంది యువత, నిరుద్యోగులు హాజరై సభను విజయవంతం చేశారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ ను వెనక్కినెట్టి రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావించింది. చివరకు అది విఫలం అయి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అయింది. దీనిని బట్టి అర్థమైంది ఏమిటంటే బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి రావడం కంటే కూడా నంబర్2 లో ఉండడమే ముఖ్యంగా కనిపిస్తుందని భావిస్తున్నారు.
T.V.SRIKAR