Thummala Nageswara Rao: తుమ్మలకు దక్కని చోటు.. దారెటు..? కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఏంటి..?

2018 ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఐనా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల పట్టుకోల్పోలేదు. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన.. కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 05:53 PM IST

Thummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరావు.. రాజకీయానికి పరిచయం అవసరం లేని పేరు. ఖమ్మం జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా ఏలుతున్న నేత. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తుమ్మల ఎంట్రీతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం అయింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే 2018 ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఐనా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల పట్టుకోల్పోలేదు.

గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన.. కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఐతే ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్‌లో తుమ్మలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఓ సమయంలో తుమ్మల పార్టీ మారబోతున్నారనే ప్రచారం సాగింది. ఐతే కేసీఆర్ ఎంట్రీ ఇచ్చి.. తుమ్మలకు నచ్చజెప్పారు. దీంతో ఈ ఎన్నికల్లో మళ్లీ తుమ్మల అసెంబ్లీలో అడుగుపెడతారు అనుకుంటే.. కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. బీఆర్ఎస్‌ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించారు సీఎం కేసీఆర్‌. తుమ్మల మొదటి నుంచి ఆశిస్తున్న పాలేరు టికెట్ ఇవ్వడానికి కేసీఆర్‌ నిరాకరించారు. తన ప్రత్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కన్ఫార్మ్ కావడంతో ప్రస్తుతం తుమ్మల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఉమ్మడి జిల్లా జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాలేరును మళ్లీ కందాలji అప్పగించడంపై తుమ్మల అనుచరులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. పాలేరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు భేటీ అయ్యారు.

తుమ్మలకు టికెట్‌ దక్కని వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది. ఇక అటు కొన్నిరోజులుగా బీఆర్ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న తుమ్మల.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అలర్ట్ అయ్యాయి. తుమ్మలను ఒప్పించేందుకు దూతలను కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆయన ఎలాంటి డిమాండ్‌ పెట్టినా.. ఓకే అనేందుకు కమలం, కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తుమ్మల పార్టీ మారితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరికతో బలహీనపడిన కారు పార్టీకి.. మరింత దెబ్బ పడడం ఖాయం.