Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న తుమ్మల కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్కతో తుమ్మల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తుమ్మల నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించారు. ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ నెల 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సభను భారీ ఎత్తున, లక్షలాది జనం మధ్య నిర్వహించబోతుంది. ఈ సభలోనే తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. లేదా ప్రధానంగా ఐదు హామీలు ఇవ్వబోతోంది. ఈ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తుమ్మల చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
బీఆర్ఎస్ నేతగా కొనసాగిన తుమ్మలకు ఆ పార్టీ తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇటు తుమ్మల.. అటు పొంగులేటి చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కానుంది. తుమ్మల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.