TDP Tickets: లోకేష్.. చంద్రబాబు.. టికెట్ల గోల !

"పని చేయకుండా, జనంలో తిరగకుండా ఇంట్లో కూర్చుని మా మాన్న ఇది, మా తాత ఇది అని కబుర్లు చెబితే నాతో సహా ఎవరికీ టికెట్ రాదు" అని పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 08:55 AM IST

టీడీపీ అసెంబ్లీ టికెట్ల కోసం కాంపిటీషన్ మామూలుగా లేదు. సైకిల్ పార్టీ టికెట్ ను దక్కించుకునేందుకు నాయకులు తెగ పోటీపడుతున్నారు. ఎవరి దారిలో వాళ్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు లీడర్లు టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఎడతెరిపిలేని ప్రయత్నాలు చేస్తున్నారు. అలుపెరగకుండా యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను.. టీడీపీ టికెట్ ను ఆశించే లీడర్లు అలుపెరగకుండా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఓ వైపు పాదయాత్రతో జనాలకు దగ్గర కావాలని లోకేష్ చూస్తుంటే.. మరోవైపు ఆయనకు దగ్గర కావాలని టికెట్ ఆశించే లీడర్లు తాపత్రయ పడుతున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా లోకేష్ దృష్టిలో పడేందుకు, ఆయనతో మాట్లాడేందుకు యత్నిస్తున్నారు. ఇలా తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పార్టీ టికెట్ ను అడుగుతున్న వాళ్లకు హామీ ఇవ్వలేక.. సూటిగా నో అని చెప్పలేక.. తరువాత చూద్దామని మెల్లగా నచ్చజెప్పి లోకేష్ పంపిస్తున్నారట!

అది టికెట్ల యాత్ర కాదు..!

టీడీపీ టికెట్ల కోసం నారా లోకేష్ దగ్గరికి వెళ్లి కొందరు నేతలు పైరవీలు చేసిన విషయం చివరకు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబుకు చేరిందని, దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. పైరవీలతో టికెట్లు రావని.. ప్రజల నిర్ణయంతోనే వస్తాయని కొందరు నేతల ముందు బాబు కుండబద్దలు కొట్టారట. సీనియారిటీలు, ఇతర క్వాలిఫికేషన్స్ ఏవి కూడా పనిచేయవని.. సర్వేలలో ఎవరికి ఎక్కువ జనాదరణ ఉంటే వాళ్లకే టికెట్స్ ఇస్తామని టీడీపీ చీఫ్ తేల్చి చెప్పారట. ప్రజాదరణ ఉన్నవాళ్లు జూనియర్ అయినా సరే టికెట్ ఇస్తామని బాబు క్లారిటీగా చెప్పేశారట. నారా లోకేష్ ది యువగళం పాదయాత్ర తప్ప టికెట్ల యాత్ర కాదని చంద్రబాబు సుతిమెత్తగా తమ్ముళ్లకు క్లాస్ పీకారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
టికెట్ల కోసం పైరవీలు చేయడం ఆపేసి.. జనంలోకి వెళ్తే ఎంతోకొంత రిజల్ట్ ఉంటుందని కొందరు లీడర్స్ కు టీడీపీ చీఫ్ హితవు పలికారట.

పని చేయకపోతే నాకూ నో టికెట్..

చిత్తూరు, అనంతపురం జిల్లాలలోని కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు లోకేష్ అభ్యర్ధులను ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగింది. అయితే దీన్ని ఆయన ఇటీవల ఖండించారు. యువగళం పాదయాత్రలో తాను చేయి ఎత్తించిన నాయకులందరికీ టికెట్ ఖరారైనట్టేనని జరిగిన ప్రచారాన్ని తప్పుపట్టారు. తనతో సహా ఎవరైనా క్షేత్ర స్థాయిలో టీడీపీ కోసం పని చేయకపోతే టికెట్ దక్కదని చెప్పారు. టికెట్ ఖరారు చేసేది పార్టీ అధినేతేనని లోకేష్ తేల్చి చెప్పారు. టికెట్ వచ్చిందని ఇంట్లో కూర్చుంటే కుదరదని, బీ-ఫారం వచ్చే వరకూ ఎవరికీ గ్యారంటీ లేదని లోకేష్ స్పష్టం చేశారు. “పని చేయకుండా, జనంలో తిరగకుండా ఇంట్లో కూర్చుని మా మాన్న ఇది, మా తాత ఇది అని కబుర్లు చెబితే నాతో సహా ఎవరికీ టికెట్ రాదు” అని పేర్కొన్నారు. పార్టీ తరఫున ఎవరు కార్యక్రమాలు చేస్తామని చెప్పినా ఆహ్వానిస్తున్నామన్నారు. ఇంఛార్జ్ లు తమ నియోజకవర్గాల్లోకి ఎవరూ రాకూడదంటే కుదరదన్నారు. కొందరికి వచ్చే ఎన్నికల్లో, మరి కొందరికి 2029లో టికెట్లు దక్కే అవకాశం ఉంటుందన్నారు. పని చేయకపోతే ఎప్పటికీ ఛాన్స్ దొరకదని లోకేష్ ఇటీవల అన్నారు.