Warangal Congress: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. టిక్కెట్ల కోసం నేతల మధ్య పోటీ పెరిగి, పార్టీ పరువు బజారుకు ఈడుస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో వర్గ పోరు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతోంది.
వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్గాలుగా చీలిపోయి రచ్చ చేసుకుంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో జంగా రాఘవ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయింది. ఇదే సమయంలో ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. మండలాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పాలకుర్తి నుంచి దాదాపుగా ఆమెకు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్న క్రమంలో తొర్రూరుకు చెందిన టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి రూపంలో ఝాన్సీరెడ్డికి అసమ్మతి ఎదురవుతోంది. తిరుపతి రెడ్డి కూడా పాలకుర్తి టిక్కెట్ ఆశిస్తూ, ఝాన్సీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే, తిరుపతి రెడ్డికి వ్యతిరేకంగా ఝాన్సీ రెడ్డి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇటీవల ఎర్రం రెడ్డి తొర్రూరులో ఏర్పాటు చేసిన ఓ సమావేశాన్ని ఝాన్సీరెడ్డి వర్గీయులు అడ్డుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తొర్రూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఝాన్సీరెడ్డి నాయకత్వం వర్ధిలాలి, తిరుపతిరెడ్డి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆరేండ్లుగా కాంగ్రెస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని, కాంగ్రెస్ ఎన్నారై విభాగంలో కూడా ఝాన్సీరెడ్డికి సభ్యత్వం లేదని, పార్టీ కోసం ఏనాడూ పని చేయలేదని, పాలకుర్తి టికెట్ ఆశించడం సరికాదని తిరుపతిరెడ్డి అంతే ఘాటుగా బదులిచ్చారు. అయితే, అధికార బీఆర్ఎస్‌కు లాభం కలిగించేలా తిరుపతి రెడ్డి తీరు ఉందంటూ ఝాన్సీ రెడ్డి వర్గం ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరిలో పాలకుర్తి టిక్కెట్ ఎవరికి దక్కుతుంది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
వర్ధన్నపేట కాంగ్రెస్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న నమిండ్ల శ్రీనివాస్, మాజీ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మధ్య టికెట్ వార్ కొనసాగుతోంది. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన నియోజక వర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇరువురు నేతలు భారీ బల ప్రదర్శనకు దిగారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి హాజరైన పార్లమెంటు ఇంఛార్జి రవీంద్ర ఉత్తమరావు దాల్వితోపాటు రాష్ట్ర నేతలు శోభారాణి, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు కొండా మురళి, నాయిని రాజేందర్ రెడ్డి వంటి నాయకుల సమక్షంలోనే ఇరువురి పంచాయితీ బయటపడింది. సభా వేదికపైకి నమిండ్ల శ్రీనివాస్‌ను పిలిచి, నాగరాజును ఆహ్వానించకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చివరకు నాగరాజును వేదికపైకి ఆహ్వానించి, నేతలు సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది.
ఇలా పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో టిక్కెట్ ఆశిస్తున్న నేతల మధ్య పంచాయితీ పార్టీకి తలనొప్పిగా మారింది. మరోవైపు నేతలు అధిష్టానానికి దగ్గరగా ఉంటూ, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటూ, నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.