Jangaon: బీఆర్ఎస్ రేసుగుర్రాల లిస్ట్ ప్రకటించారు సీఎం కేసీఆర్. 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఎవరో అనౌన్స్ చేసిన కేసీఆర్.. నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని.. చర్చించి, పరిష్కరించి ఆ నాలుగు స్థానాలకు కూడా త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఆ నాలుగు స్థానాల్లో జనగామ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. కేసీఆర్‌కు ఆప్తుడు, బీఆర్ఎస్‌లో కీలక నేత అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు జనగామలో పరిశీలనకు రావడమే ఇందుకు కారణం.
దీంతో జనగామ టికెట్ ఎవరికి అనే దానిపై జోరు చర్చ సాగుతోంది. ముత్తిరెడ్డి, పల్లాతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా జనగామ టికెట్ కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు రాజకీయం నడిపిస్తున్నారు. జనగామపై పట్టు సాధించేందుకు పోచంపల్లి రెండేళ్ల ముందు నుంచే పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో తనకంటూ కేడర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదే సమయంలో జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ముత్తిరెడ్డి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనగామకు చెందిన 25 మంది కీలకనేతలను హైదరాబాద్ పిలిపించుకొని మరీ పల్లా భేటీ కావడం ఆసక్తి రేపింది.
ఇక అదే సమయంలో ముత్తిరెడ్డి కూడా పట్టిన పట్టు వీడటం లేదు. తన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేశారు ఇప్పటికే! పల్లా వద్దు.. ముత్తిరెడ్డి ముద్దు అంటూ ఆయన వర్గం కార్యకర్తలు చేసిన నినాదాలు ఇంకా రీసౌండ్ ఇస్తున్నాయి. హైదరాబాద్ మల్లాపూర్‌లోని నోమా ఫంక్షన్ హాల్‌లో తన వర్గం నేతలతో భేటీ నిర్వహించారు. కేసీఆర్‌కు పల్లా సన్నిహితుడు అనే పేరు ఉంది. కేటీఆర్‌కు పోచంపల్లి క్లోజ్ ఫ్రెండ్, యూఎస్‌లో రూమ్మేట్ కూడా! ఇలాంటి పరిణామాల మధ్య కేసీఆర్‌ను కలిసేందుకు ముత్తిరెడ్డి ప్రయత్నించగా.. కనీసం అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదు. దీంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.