Times Now Survey: వైసీపీ మార్క్ సర్వే…! హాయిగా నవ్వుకోండి..!

ఏదైనా అబద్దం చెబితే అది అందంగా, అతికినట్లు ఉండాలి. విషయం ఏమిటంటే టైమ్స్‌ నౌ నవభారత్ అనే సంస్థ ఓ సర్వేను ప్రకటించింది. అందులో ఏకంగా వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీకి గరిష్టంగా వస్తే ఒక సీటు రావొచ్చట. దేశం మొత్తం తీసుకుంటే వైసీపీ మూడో స్థానంలో ఉంటుందట. ఈ ఒక్క సర్వేతో దాని విశ్వసనీయత ఎంతో తేలిపోయింది.

Times Now Survey: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయట.. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..? అలా అని ఓ సర్వే చెప్పిందంటూ వైసీపీ అధికార మీడియా తెగ ఊదరగొట్టేసింది. దేశంలో మూడో అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉంటుందంటూ బ్రేకింగ్‌లు నడిపింది. నిజంగా అన్ని సీట్లు వస్తాయా..? అంత సీన్ అధికార పార్టీకి ఉందా..?
ఏదైనా అబద్దం చెబితే అది అందంగా, అతికినట్లు ఉండాలి. అది నిజమేనేమో అనిపించాలి. రాజకీయాల్లో ఇది మరీ ముఖ్యం. ఓటర్లను భ్రమల్లో ఉంచాలంటే రాజకీయ నాయకుడికి ఈ లక్షణం ఎప్పుడూ ఉండాలి. కానీ వైసీపీ మాత్రం దాన్ని గుర్తించినట్లు లేదు. లేదా ప్రజలు మనం ఏం చెప్పినా నమ్ముతారులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నట్లుంది. విషయం ఏమిటంటే టైమ్స్‌ నౌ నవభారత్ అనే సంస్థ ఓ సర్వేను ప్రకటించింది. అందులో ఏకంగా వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీకి గరిష్టంగా వస్తే ఒక సీటు రావొచ్చట. దేశం మొత్తం తీసుకుంటే వైసీపీ మూడో స్థానంలో ఉంటుందట. ఈ ఒక్క సర్వేతో దాని విశ్వసనీయత ఎంతో తేలిపోయింది.
ఏపీలో 25 లోక్‌సభ సీట్లుంటే అందులో 24 నుంచి 25 వైసీపీ ఖాతాలో చేరతాయని చెప్పడం వైసీపీ హైకమాండ్‌కు ఆనందం కలిగిస్తోంది. కానీ వాస్తవం మాత్రం నక్కకు, నాగలోకానికి ఉన్నంత దూరంలో ఉంది. వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా సర్వేను వండి వార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల గురించి ఓనమాలు తెలిసిన వారు కూడా ఈ సర్వేను చూస్తే అది ఎలా సిద్ధమైందో చెప్పేస్తారు. వైసీపీ నేతలకు కూడా ఇది నమ్మశక్యం కాని సర్వేనే. 2019లో వైసీపీకి 22, టీడీపీకి 3ఎంపీ సీట్లు వచ్చాయి. అంత జగన్ ప్రభంజనం ఉన్న సమయంలోనూ విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలో టీడీపీనే నెగ్గింది. అప్పుడున్న ఊపు ఇప్పుడు వైసీపీకి లేనే లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో తమ గ్రాఫ్ పడిపోయిందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని.. ఒకవేళ గెలిచినా గతంలో ఉన్నన్ని సీట్లైతే ఖచ్చితంగా రావని చెబుతున్నారు. అంటే వైసీపీ గట్టిగా పోరాడితే గెలవొచ్చు. కానీ ఈ విషయంలో వైసీపీ నేతలకు లేని నమ్మకం ఈ టైమ్స్‌నౌ నవభారత్‌ సర్వేకు ఎలా వచ్చిందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. గత ఏప్రిల్‌లో కూడా ఇదే సంస్థ ఓ సర్వే ప్రకటించింది. అందులో కూడా వైసీపీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే పాతసర్వేకే మరోసారి పోపు పెట్టి వదిలినట్లు కనిపిస్తోంది.
గతంతో పోల్చితే టీడీపీ గ్రాఫు పెరిగిందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీలో వైసీపీ పరిస్థితేంటన్నది చెప్పకనే చెబుతున్నాయి. పైగా టీడీపీ, జనసేన కలవబోతున్నాయి. ఇంత జరుగుతున్నా వాస్తవాలను పక్కకునెట్టేసి తమకు ఇష్టం వచ్చినట్లు ఈ సర్వే చేసినట్లు చిన్న పిల్లలకు కూడా అర్థమవుతోంది. టీడీపీకి కనీసం నాలుగైదు సీట్లన్నా రావా..? కనీసం అలా ఇచ్చినా నిజమేనేమో అని జనం నమ్ముతారు కదా..!
ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందన్నది వైసీపీ నేతలు కూడా కాదనలేని వాస్తవం. డబ్బును పంచుతున్నా ఎక్కడా అభివృద్ధి అన్నది మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీచర్లు కూడా దూరమయ్యారు. రైతుల నుంచి కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. నిధుల్లేవు. రోడ్లు బాగోలేవు. కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్నవి పోయాయి. కరెంట్‌ ఛార్జీలు పెరిగిపోయాయి. ఆర్టీసీదీ అదే పరిస్థితి. మొత్తంగా పాలనేమీ బాగోలేదు. మరి ఇవేమీ టైమ్స్‌నౌ నవభారత్‌కు కనిపించలేదా..? లేక స్వామిభక్తిలో భాగంగా ఇలా చేసిందా..? ఈ సంస్థకు, వైసీపీకి లింకుందా అంటే ఖచ్చితంగా ఉంది. ఓ కాంట్రాక్టును టైమ్స్‌ గ్రూప్‌ ఏపీ ప్రభుత్వం నుంచి సంపాదించింది. ఆ కృతజ్ఞత తీర్చుకునేందుకే ఇలా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి పాత సర్వేను టైమ్స్‌నౌ నవభారత్‌ వండి వడ్డిస్తే దాన్ని వైసీపీ అధికార మీడియా ఆబగా బ్రేకింగులు నడిపేసింది.