Raja Abel: సినిమా లవర్స్‌కు ఆనంద్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్ట్ క్లాసిక్ అది! డైరెక్టర్‌గా శేఖర్ కమ్ములకు ఎంత పేరు వచ్చిందో.. హీరోగా రాజాకు కూడా అంతే పేరు తెచ్చిపెట్టిందా మూవీ. యాక్టర్‌గా, హీరోగా సినిమాలు చేసిన రాజాను తెలుగు ప్రేక్షకులు మరిచిపోరు. వెన్నెల, ఆనంద్‌లాంటి సినిమాలతో పక్కింటి అబ్బాయి ముద్ర వేసుకుని.. అందరినీ ఆకట్టుకున్న రాజా అసలు పేరు రాజా అబేల్. రాజా తల్లి బ్రిటిషర్ కాగా, తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు.
సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే ఆ తర్వాత సడెన్‌గా సినిమాలకు దూరం అయిన రాజా.. పాస్టర్‌గా సెటిల్ అయ్యాడు. ఒకప్పుడు వైఎస్ మీద అభిమానంతో.. కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయన మరణం తర్వాత పార్టీ నుంచి బయటికి వచ్చి పాస్టర్ అయ్యాడు. పాస్టర్‌గా దైవసేవలో మునిగి తేలుతున్న ఆయన.. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు సమక్షంలో.. ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యే అవకాశం వచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని రాజా అన్నాడు. కాంగ్రెస్‌లాంటి సెక్యులర్ ఆలోచనలు ఉన్న పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, అన్ని వర్గాలకీ న్యాయం చేసే పార్టీగా కాంగ్రెస్ ఉందని అన్నారు.
జాతీయస్థాయిలో తెలుగువారికి లీడర్‌గా ఉండే అవకాశం కాంగ్రెస్ వలన వచ్చిందన్న రాజా.. మణిపూర్ అంశంలో చాలామంది నోరు మెదపలేకపోయారని విమర్శించారు. ఐతే రాజా కాంగ్రెస్‌లో చేరడంతో.. ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి ఒరిగిదేమీ లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో దాదాపు పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్‌లో.. ఒకరు చేరడం అంటే పెద్ద విషయమే! రాజా సేవలను రాష్ట్రానికి పరిమితం చేస్తుందా.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాడుకుంటుందా అన్నది ఎదురుచూడాల్సిందే.