Saptagiri: టీడీపీలోకి నటుడు సప్తగిరి పోటీ చేయబోయేది ఇక్కడి నుంచే..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌ జపాంగ్‌లు వినిపిస్తున్నాయ్. సినిమా తారలు కూడా.. రాజకీయాల్లో తమ అదృష్టం టెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కమెడియన్ కమ్ హీరో సప్తగిరి కూడా టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 01:49 PM IST

దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చాడు. తనది చిత్తూరు జిల్లానే అని.. పేదల కష్టాలు తెలుసని.. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తన వంతు కృషి చేస్తానని అన్నాడు సప్తగిరి. టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవమని.. మరో 10, 15 రోజుల్లో శుభవార్త చెప్తానంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.

చంద్రబాబు డెవలప్‌మెంట్‌ అందరూ చూశారని.. తాను ఎన్నికల్లో పోటీచేయడంపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు సప్తగిరి. చిత్తూరు జిల్లాతో తనకు అనుబంధం ఉందన్నారు సప్తగిరి. తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వస్తే చిత్తూరు జిల్లాలోని పార్లమెంటు కానీ, అసెంబ్లీకి కానీ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చంద్రబాబు, లోకేష్‌ ఏం ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. టీడీపీ అధికారంలో తెచ్చేందుకు తన సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధమన్నారు.

సప్తగిరి తాను టీడీపీలో చేరబోతున్నట్లు నేరుగా ప్రకటించారు. అలాగే ఎన్నికల్లో పోటీకి రెడీ అన్నారు.. ఈ ప్రకటనపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాలి మరి ! చిత్తూరు జిల్లా నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి.. ఇటు రాజకీయాల్లో రాణిస్తున్నవారు లేకపోలేదు. రోజా టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో వైసీపీ కండువా కప్పుకుని.. నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.. ఇప్పుడు ఏకంగా మంత్రి అయ్యారు.

దివంగత నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కూడా సినిమాల్లో నటించారు.. చంద్రబాబుతో ఉన్న స్నేహంతో టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిత్తూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు సప్తగిరి కూడా అదేబాటలో నడుస్తున్నారు.. టీడీపీలో చేరి పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.