TOP STORY: అల్లర్ల వెనక కేసీఆర్? లగచర్ల అల్లర్లకు రూ.10 కోట్లు ఇచ్చిన కేసీఆర్‌ ?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన లగచర్ల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 08:12 PM IST

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన లగచర్ల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో ఏ-1గా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు వాదనలను వినిపించారు. “భూసేకరణకు అడుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా.. ఏమీ కాదు.

మన వెనుక పెద్దలు కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు.. అంటూ ఈ కేసులో ఏ-1గా ఉన్న పిటిషనర్ నరేందర్‌రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ చెప్పారు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. విచారణ కోసం వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులను చంపేందుకు నిందితులు కుట్ర చేశారంటూ చెప్పారు. కలెక్టకర్ వచ్చిన వెంటనే.. ఎలాంటి చర్చలు, సంభాషణలు జరగకముందే.. నిందితులు విరుచుకుపడ్డారని.. హత్య చేయాలనే ముందస్తు ప్రణాళిక ఉన్నందునే కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారని వాదించారు. ఏ-2 సురేశ్ గ్రామంలో స్థానికంగా ఉండడంలేదు. అతడు ఓ యూట్యూబర్, హైదరాబాద్లోనే ఉంటున్నాడు. నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేశ్ అక్కడికి వెళ్లాడు. భూసేకరణలో సురేశ్ భూమి లేదు. హత్య కుట్రలో నరేందర్‌ రెడ్డిది కీలక పాత్ర. నిందితులు కూడా తమ వెనక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకొచ్చారు” అని కోర్టుకు వివరించారు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.

కలెక్టర్ హత్యకు కుట్ర ద్వారా భూసేకరణ ప్రక్రియను భగ్నం చేసి.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నది నిందితుల వ్యూహమని తెలిపారు. వచ్చేది కలెక్టర్ అయినా.. తహసీల్దార్ అయినా. దాడి చేయాలంటూ పిటిషనర్ రెచ్చగొట్టారని ఆరోపించారు. “లగచర్ల దాడి ఘటనకు 15 రోజుల ముందే నిందితులకు పిటిషనర్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగానే 84 ఫోన్ కాల్స్ మాట్లాడారని చెప్పారు. నరేందర్‌రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలను వినిపించారు. తన క్లైంటు 15 మంది పోలీసులు కేబీఆర్ పార్కులో కిడ్నాప్ చేశారని పేర్కొ న్నారు. ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్టెంగాల్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని.. ఆ సమాచారం డ్రైవర్‌కు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు.

వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. పిటిషనర్ తన ఎదుట ఉన్న లీగల్ రెమిడీస్ ప్రకారమే పిటిషన్లు వేస్తున్నారని.. అది పిటిషనర్ హక్కు అని స్పష్టం చేసింది. పోలీసులు కీలక ఆధారాలను సేకరించడంలో విఫలమవుతున్నారని.. ఘటన జరిగిన నాటి నుంచి అరెస్టు వరకు పోలీసులు ఏం దర్యాప్తు చేశారు ? ఏం ఆధారాలు సేకరించారని నిలదీసింది. డిప్యూటీ కలెక్టర్‌కు తీవ్రమైన గాయాలు అయినట్లు పేర్కొంటున్నా.. డాక్టర్ రిపోర్ట్ అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఒకే నేరానికి వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారంటూ నరేందర్‌రెడ్డి భార్య పట్నం శ్రుతి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సైతం జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.