అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ లో మీ వాళ్లు ఎవరైనా ఉన్నారా…? సెలవలనో మరో కారణంతోనే ఇండియా వచ్చారా…? వెంటనే ఫోన్ కొట్టండి.. అమెరికా ఫ్లెటెక్కేయమని చెప్పండి. ఇప్పుడు రిటర్న్్ కాకపోతే మళ్లీ అమెరికాలోకి ఎంట్రీ డౌటే… అక్కడ కొరడా పట్టుకుని ట్రంప్ వెయిటింగ్ మరి…!
అనుకున్నట్లే అవుతోంది. అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కత్తికి పదును పెడుతున్నారు. అమెరికాలోని ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఇప్పటికే కంటిమీద కునుకు కరవైంది. నిద్రపోతే కలలోకి ట్రంప్ వచ్సేస్తున్నాడు మరి. వదల బొమ్మాళీ నేనొస్తున్నా… మీ సంగతి తేల్చేస్తున్నా అంటూ బెదిరిస్తున్నట్లు పీడకలలు వచ్చేస్తున్నాయి వాళ్లందరికీ. అంతలా భయపెట్టాడు ట్రంప్. ఇప్పుడు భారతీయ విద్యార్థులకు కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. అధికారంలోకి రాగానే ఇమ్మిగ్రేషన్ పాలసీని టైట్ చేయబోతున్నారు ట్రంప్. ఇప్పటికే ఆ దిశగా వర్క్ మొదలైంది. అమెరికాకు వెళ్లడం ఇప్పటికే కష్టమవుతుంటే ఇక జనవరి తర్వాత పరిస్థితి ఏంటో ఊహించుకోండి.
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా స్వదేశానికి వచ్చి ఉంటే వెంటనే వారిని వెనక్కు వచ్చేయమని యూనివర్శిటీలు సమాచారం పంపుతున్నాయి. శీతాకాలం సెలవలకోసం వచ్చినవారు ట్రంప్ ప్రమాణస్వీకారం చేసేలోగానే అమెరికా చేరుకోవాలని సూచిస్తున్నాయి. అదే విధంగా తమ విదేశీ ఉద్యోగులను కూడా వెంటనే వచ్చేయమని మెసేజ్ లు పెడుతున్నాయి. వ్యాలీడ్ వీసా ఉన్నా రిస్క్ తీసుకోకూడదని యూనివర్శిటీలు, ఆయా సంస్థలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. 2016లో కూడా ట్రంప్ వచ్చాక విదేశీ విద్యార్థులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొన్ని దేశాల విద్యార్థుల్ని అమెరికాలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నాడు ట్రంప్. చదువు మధ్యలో ఉందని చెప్పినా, ఎన్ని విమర్శలు వచ్చినా డోంట్ కేర్ అన్నారు. ట్రంప్ దెబ్బకు ఎంతోమంది నష్టపోయారు కూడా.. మళ్లీ ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే అలాంటి తిక్క పనులు ఏమైనా చేస్తారేమోనని చాలామంది భయపడుతున్నారు. చాలామంది విద్యార్థులు అమెరికా అధ్యక్ష ఫలితాలు వచ్చిన వెంటనే రిటర్న్్ ఫ్లైటెక్కేశారు. ఇక వెకేషన్ లో ఉన్న ఎంతోమంది NRIలు డిసెంబర్ లో అమెరికా వెళ్లిపోవడానికి రెడీ అయిపోయారు.
అమెరికాలో చదువుకుంటున్న వారికే కాదు ఇప్పుడే చదువు పూర్తి చేసుకుంటున్న చాలామందికి ఇప్పుడు ట్రంప్ థ్రెట్ పొంచి ఉంది. మనవాళ్లు చాలామంది చదువు పూర్తికాగానే వీసా గడువు ఉండటంతో అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈలోగా H1Bవీసాల కోసం ప్రయత్నిస్తున్నారు. అదృష్టం ఉన్నవారు ఊపిరి పీల్చుకుంటుంటే అది లేనివారు మాత్రం మళ్లీ మళ్లీ H1Bకోసం దండయాత్రలు చేస్తున్నారు. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల్లో భారతీయులే అధికం. 2009 తర్వాత ఈ ఏడాది అమెరికాకు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువమంది ఇండియన్లే… అందులోనూ 60శాతం మంది వరకు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారనేది ఓ అంచనా. 2021లో 96వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికా వీసా తీసుకుంటే అది 2023నాటికి లక్షా 40వేలకు చేరుకుంది. ఈసారి అది లక్షా 80వేలకు పైనే ఉంటుందన్నది ఓ అంచనా. ఇలా చదువుకోవడానికి వచ్చిన చాలామంది ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ అమెరికాలో గడిపేస్తున్నారని దానివల్ల దిగువస్థాయి అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదన్నది ట్రంప్ వాదన. వాళ్లందరినీ తరిమికొడతానని బెదిరిస్తున్నారు ఆయన. ఇదే విద్యార్థులను టెన్షన్ పెడుతోంది. చాలామంది విద్యార్థులు చదువుకుంటూనే పాకెట్ మనీకి సంపాదించుకునేవారు. ఇప్పుడు ట్రంప్ వస్తే ఆ పాకెట్ మనీ కూడా రాకుండా అడ్డుకునేలా చట్టం తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. బైడెన్ కొంత సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరించారు. కానీ ట్రంప్ మాత్రం అలా కాదు. ట్రంప్ గత పాలనలో H1B, F-1, H-4వీసాలు దొరకడం గగనమైపోయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయని చాలామంది అనుమానిస్తున్నారు.
కొంతమంది మాత్రం భారతీయ విద్యార్థలు భయపడాల్సిన పనిలేదంటున్నారు. H1-B వీసాలు 65వేల వరకు ఇస్తున్నారు. అలాగే అక్కడ మాస్టర్స్ చదువుకున్న విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తున్నారు. ఇక విద్యార్థులకు 12నెలల వర్క్ వీసా ఇస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో చదివిన వారికి మరో 24నెలలు ఎక్స్ టెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి భయపడాల్సిన పనిలేదంటున్నారు.
అయితే ట్రంప్ ను నమ్మడానికి లేదు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. కాబట్టి అక్కడ చదువుకుంటూ ఇక్కడకు వచ్చిన వారు వెంటనే ఫ్లైట్ ఎక్కేయడం బెటర్. లేకపోతే విమానాశ్రయం నుంచి వెనక్కు పంపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సో బీ అలర్ట్.