Top story: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, ఇండియా కూటమికి షాకిచ్చిన అరవింద కేజ్రీవాల్

ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. అసలే మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర ఓటమిలో ఉన్న హస్తం పార్టీకి...ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఝలక్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో...ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - December 2, 2024 / 08:05 PM IST

ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. అసలే మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర ఓటమిలో ఉన్న హస్తం పార్టీకి…ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఝలక్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో…ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధిస్తే..జార్కండ్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయో లేదో…వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ…నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్…సీఎం పదవికి రాజీనామా చేశారు. అతిషీని ముఖ్యమంత్రిని చేశారు. నిర్దోషిత్యాన్ని నిరూపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతానని శపథం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

వాస్తవానికి ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో…ఆప్‌, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేశాయి. ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. మొత్తం లోక్‌ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి నిరాకరించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకూ…ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉంది. ఇండియా కూటమికి మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించలేకపోయింది. కలిసి పోటీ చేసినా ఎలాంటి అనుకూల ఫలితాలు రాకపోవడంతోనే…ఒంటరిగా పోటీ చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో…ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లేనా అన్న చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల నుంచి ఇండియా కూటమి నుంచి ఇంకెన్ని పార్టీలు బయటకు వస్తాయోననే ప్రచారం మొదలైంది.

2013 నుంచి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వమే నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన తొలిసారి…అరవింద్ కేజ్రీవాల్ సంచలనం రేపారు. తొలి ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2015 మధ్య ఎన్నికలు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన యుబీటీ, ఎన్సీపీ ఎస్పీ కలిసి పోటీ చేశాయి. అయినప్పటికీ విజయం సాధించలేకపోయాయి. మరాఠా ఎన్నికల ఫలితాల తర్వాత అరవింద్ కేజ్రీవాల్…ఇండియా కూటమికి షాకిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఏర్పాటైనప్పటి నుంచి అందులో కొనసాగుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ…2013 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. 28 సీట్లు సాధించి…కాంగ్రెస్ సాయంతో ఆప్ ప్రభుత్వం ఏర్పాటైంది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2015లో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో…మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అందరి అంచనాలను తలికిందులు చేస్తూ…ఆప్ 67 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వం కొనసాగింది. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ…ఆమ్ ఆద్మీ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. 62 సీట్ల గెలిచిన ఆప్…అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.