Top story:సీఎం సీటే లక్ష్యంగా తెలంగాణలో బీసీ ఉద్యమం

తెలంగాణలో మరో కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటివరకు ప్రాంతీయ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చూసిన తెలంగాణ ఇక రాబోయే రోజుల్లో కుల పోరాటాలను చూడబోతోంది. సీఎం కుర్చీ లక్ష్యంగా బీసీలు అందర్నీ ఒక్కటి చేసే వ్యూహాత్మక ఉద్యమం మొదలైంది.

  • Written By:
  • Publish Date - October 23, 2024 / 05:49 PM IST

తెలంగాణలో మరో కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటివరకు ప్రాంతీయ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చూసిన తెలంగాణ ఇక రాబోయే రోజుల్లో కుల పోరాటాలను చూడబోతోంది. సీఎం కుర్చీ లక్ష్యంగా బీసీలు అందర్నీ ఒక్కటి చేసే వ్యూహాత్మక ఉద్యమం మొదలైంది. దీని వెనక బిజెపి పావులు కదుపుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా రాబోయే నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో కులవాదం బలంగా వినిపించబోతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ముగిసి పదేళ్లు దాటిపోయింది. తెలంగాణ వ్యక్తి మాత్రమే తెలంగాణను పరిపాలించాలని, అప్పుడే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో మలిదశ ఉద్యమం నడిచింది.2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి… లక్ష్యాన్ని నెరవేర్చుకుంది.

అయితే ఉద్యమ కాలంలో కెసిఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని ప్రమాణం చేసి, ప్రకటించి… అన్ని హామీలు లాగే దానిని గాల్లో కలిపేశాడు. ఉద్యమం ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక… సహజంగానే అధికారంలో ఎవరికి ఎంత వాటా అనే వాదన మొదలవుతుంది. పదేళ్లపాటు సీఎం కుర్చీ వెలమ దొరల దగ్గరే ఉంది. టిఆర్ఎస్…. బి ఆర్ ఎస్ గా మారినా…. దాని సహజ లక్షణాలు ఏవి పోలేదు. బి ఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం సీఎం కుర్చీ అగ్రకులమైన వెలమల దగ్గరే ఉంటుంది. కెసిఆర్ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత కేటీఆర్ కొడుకు… లేదా హరీష్ రావు వీళ్లను దాటి సీఎం పదవి పోదు. ఇక కాంగ్రెస్ అంటేనే రెడ్లు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కచ్చితంగా రెడ్ల కే సీఎం సీటు దక్కుతుంది. అది మరోసారి రేవంత్ రెడ్డి రూపంలో నిజమైంది. అంటే రాష్ట్రం అయితే ఏర్పడింది తప్ప.. అధికారం మాత్రం అగ్రకులాల మధ్యే అటు ఇటు తిరుగుతోంది అన్నది పచ్చి నిజం.

2014లో కేవలం రెండు రాష్ట్రాల మధ్య కేవలం భౌగోళిక మైన విభజన జరిగింది , అధికారం ఏపీ అగ్రకులం నుంచి తెలంగాణ అగ్రకులానికి వచ్చిందే తప్ప… అంతకన్నా ఒరిగిందేమీ లేదనేది బీసీలు వాదన. 65% జనాభా ఉన్న బీసీలు తెలంగాణకు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? అనే వాదన రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. జనాభాలో అధిక శాతం ఉన్న వాళ్లకు అధికారం రాకపోవడం అన్యాయం అనే వాదన బయటకు తీసుకొచ్చారు. బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి, ఇన్ని కులాలు ఐక్యంగా ఉండటం చాలా కష్టం అనే బలమైన వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే రాష్ట్ర విభజన జరిగినాటి నుంచి అంతర్లీనంగా బీసీల్లో, ఎస్సీల్లో ఈ చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన… తిరిగి అధికారం అగ్రకులాలకే వచ్చింది కదా… పరిస్థితి ఎప్పటిలాగే ఉంది కదా , అగ్రకులాల మధ్య అధికార మార్పిడి జరిగిందే తప్ప… ఇది నిజమైన విభజన కాదు అనే వాదన నిత్యం జరుగుతూనే ఉంది.

ఇప్పుడది ఇంకా తీవ్రమైంది. ఈ వాదనను ఉపయోగించుకొని లాభపడాలి అన్నది బిజెపి ఆలోచన. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకుంది బిజెపి. అయితే అప్పుడు అది పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ 2028 నాటికి ఇదే నినాదాన్ని జనంలోకి బాగా తీసుకెళ్తే, 65 శాతం ఉన్న జనాభాని ఆకట్టుకోగలిగితే కచ్చితంగా అధికారం వస్తుందని బిజెపి వ్యూహం. కెసిఆర్ అధికారంలో ఉన్నంతకాలం… సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పై పోరాడిన తీన్మార్ మల్లన్న… కాంగ్రెస్ సహకారంతో ఎమ్మెల్సీ అయిన తర్వాత నిదానంగా తన స్వరం మార్చాడు. బీసీలకు రాజ్యాధికారం రావాలని, 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలని, రేవంత్ రెడ్డి చివరి తెలంగాణ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రసంగాలు దంచుతున్నాడు తీన్మార్ మల్లన్న.

అంతేకాదు తాను ఎన్నికల్లో పోటీ చేస్తే రెడ్లు తనకు ఓటు వేయొద్దంటూ, బీసీలు ఓటు వేస్తే తను గెలుస్తానంటూ భారీ ప్రకటనలు ఇస్తున్నాడు . దీంతో కాంగ్రెస్లో రెడ్లు కంగుతిన్నారు. మల్లన్న లాంటి వాడిని అనవసరంగా నెత్తిన పెట్టుకొని దెబ్బతిన్నామా అని ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. నిజానికి మల్లన్న అంత శక్తివంతుడు కాకపోయినా.. మల్లన్న వెనక మరి కొన్ని రాజకీయ శక్తులు బీసీ నినాదాన్ని మార్మోగేలా చేస్తున్నాయి. ప్రధానంగా బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ బీసీ నినాదాన్ని జనంలోకి ఎక్కించడానికి బాగా ప్రయత్నిస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బిజెపి అధికారంలోకి వస్తే తనకు కచ్చితంగా సీఎం కుర్చీ దక్కుతుందని రాజేందర్ ఆశిస్తున్నారు. తెలంగాణ బిజెపిలో ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్ ముగ్గురు బీసీలు.2028లో బిజెపికి అధికారం వస్తే కచ్చితంగా వీళ్ళ ముగ్గురిలో ఒకరికి సీఎంగా అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా బలమైన శక్తి అయిన రాజేందర్ ముదిరాజ్ కులానికి చెందినవారు. బీసీల్లో అత్యధిక సంఖ్యకులు ముదిరాజులు. అందుకే తనకు సీఎం కూర్చి దక్కవచ్చని రాజేందర్ ఆశ. ఇప్పుడు తీన్మార్ మల్లన్న వినిపిస్తున్న బీసీ నినాదం బిజెపి నేతలు వెనకనుంచి అందిస్తున్నదే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా బీసీ నినాదం ఊపొందుకుంటుంది. ఇది బిఆర్ఎస్ ,కాంగ్రెస్ రెండు పార్టీలను ఇరకాటంలో పెడుతుంది. బీసీలకు తాము చాలా చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభుత్వంలో పదవులు, పార్టీలో పదవులు ఇస్తూ జో కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. మహేష్ గౌడ్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం వెనక వ్యూహం కూడా ఇదే. ఇక గతంలో బీసీలకు చాలా చేశామని చెప్పుకుంటుంది టిఆర్ఎస్. కానీ ఏకంగా బీసీలకు రాజ్యాధికారం… సీఎం కుర్చీ చిందే అనే నినాదంతో ఉద్యమం ఊపొందుకుంటే కనక తెలంగాణలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లు రెండు ఇబ్బంది పడక తప్పదు. అయితే 65 శాతం బీసీలు మొత్తం ఒకే తాటిపైకి వస్తారా, ఒకే నినాదం కింద పని చేస్తారా.?… మున్నూరు కాపు, గౌడ , యాదవ, ముదిరాజ్, రజక, నాయి బ్రాహ్మణ కులాలన్నీ ఒక్కటవుతాయా? అది సాధ్యమేనా అన్నది వేచిచూడాలి.