Top story కేటీఆర్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందా ? రేపో మాపో జైలుకు వెళ్లక తప్పదా ?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కల్లకుంట్ల తారక రామారావు చుట్టూ...ఉచ్చు బిగుస్తోందా ? వరుస కేసులతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా ? మాజీ మంత్రికి నిద్ర లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోందా ?

  • Written By:
  • Publish Date - November 14, 2024 / 06:02 PM IST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కల్లకుంట్ల తారక రామారావు చుట్టూ…ఉచ్చు బిగుస్తోందా ? వరుస కేసులతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా ? మాజీ మంత్రికి నిద్ర లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోందా ? మాజీ సీఎం కేసీఆర్ కు సన్ స్ట్రోక్ తగిలేలా పకడ్బందీగా కేసులు పెడుతోందా ? తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే…అవే సంకేతాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయ్యాయి. డిసెంబరు 9వ తేదీకి రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది పూర్తవుతుంది. ఒకవైపు ఏడాది సంబరాలకు సిద్ధమవుతూనే..మరోవైపు గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందు పెడుతోంది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారంటూ….కాంగ్రెస్ మంత్రులు విరుచుకుపడుతున్నారు. అంశాల వారీగా బీఆర్ఎస్ తప్పులను ఆధారాలతో బయటపెడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లకు పగుళ్లు, ఓఆర్ఆర్ టెండర్లలో అక్రమాలు, ఫార్ములా వన్ కు నిధులు విడుదల, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల్లో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ముప్పు తిప్పలు పెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది.

తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి వ్యవహారంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్‌ కోర్టు పట్నం నరేందర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. నరేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు…కీలక విషయాలు రాబట్టారు. ఫార్మా కంపెనీ భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్‌ కలెక్టర్‌‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి కేసు తెలంగాణలో రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. సీఎం సొంత నియోజక వర్గంలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కలెక్టర్ పై దాడి ఘటనలో బీఆర్‌ఎస్‌ కుట్ర ఉన్నట్లు పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించారు. నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీ‌ఆర్‌ పేరును పోలీసులు ప్రస్తావించారు. నరేందర్‌రెడ్డిని కేటీఆర్‌ స్వయంగా ప్రోత్సహించినట్లు దర్యాప్తులో వెల్లడైందని… ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో అధికారులపై దాడి చేసిన 46 మందిలో 19 మందికి అక్కడ భూములు లేవని ఐజీ స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో…ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్‌ నివాసానికి తరలి వచ్చారు. కేటీఆర్‌తో మాజీ హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు బుధవారం రాత్రి సుదీర్గంగా మంతనాలు జరిపారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…డీఫ్యాక్టో ముఖ్యమంత్రిలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ కంటే ఆయనే ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నారని, పార్టీ పరంగా, ప్రభుత్వం విషయాల్లోనూ అన్నింట్లోనూ అన్ని తానై వ్యవహరించారు. కాంగ్రెస్ నేతలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టించడం, కార్యకర్తలను అరెస్టు చేయించడం కీలకపాత్ర పోషించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా మాజీ ఎమ్మెల్యేలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు పక్కా…అయితే ఏ కేసులో అరెస్టు చేస్తారు. కలెక్టర్ పై దాడి కేసులో అరెస్టు చేస్తారా ? లేదంటే ఫార్ములా వన్ నిధుల అవకతవకల్లో అరెస్టు చేస్తారా ? ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో జైలుకు పంపుతారా ? ఫోన్ ట్యాపింగ్ కేసులోనా ? డ్రగ్స్ కేసులోనా ? అన్నది తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సౌత్ కొరియా పర్యటనలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళికి ముందే బాంబు పేలబోతోందన్నారు. దీపావళి తర్వాత రెండు రోజుల్లో రాజకీయ సంచలనాలు సృష్టించే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని ఆయన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి 8 నుంచి 10 అంశాల్లో కొందరు ప్రధాన నాయకులపై చర్చ ఉండొచ్చన్నారు. దీంతో మాజీ మంత్రి మంత్రి కేటీఆర్ అరెస్టు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. ఫార్మూలా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ఏసీబీ…కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్….శాసనసభ సభ్యుడు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని ప్రశ్నించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ…రెండు వారాల క్రితమే గవర్నర్‎కు ఏసీబీ లేఖ రాసింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన వెంటనే ఏ క్షణంలో అయినా…కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వరుస కేసులతో కేటీఆర్ ను ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం…తాజాగా కలెక్టర్ దాడి ఘటనలోనూ ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.