Top story: ఫడ్నవీస్ సీఎం అయితే…షిండే పరిస్థితేంటి ? మహారాష్ట్రలో ప్రతిపక్షం అన్నదే ఉండదా ?

మహారాష్ట్రలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. 237 సీట్లు గెలుపొందిన మహాయుతి...సీఎం ఎవరన్నది మాత్రం తేల్చుకోలేకపోతోంది. అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా బీజేపీ...సీఎం పదవి తీసుకుంటుందా ?

  • Written By:
  • Publish Date - November 27, 2024 / 02:07 PM IST

మహారాష్ట్రలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. 237 సీట్లు గెలుపొందిన మహాయుతి…సీఎం ఎవరన్నది మాత్రం తేల్చుకోలేకపోతోంది. అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా బీజేపీ…సీఎం పదవి తీసుకుంటుందా ? లేదంటే ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే …మరోసారి ప్రమాణస్వీకారం చేస్తారా ? అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు ఖాయమా ?

మహారాష్ట్రలో తిరుగులేని విజయం సాధించిన మహాయుతి…ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 26న పాత అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో మంగళవారం లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మహాయుతి కసరత్తు ప్రారంభించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి వీడటం లేదు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్…రేసులో ముందున్నారు. బీజేపీకి 132 సీట్లు రావడంతో ఆ పార్టీ తరపున దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపడుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే…ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న నియమమేమీ లేదన్నారు. దీంతో మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మహాయుతి నేతలు, బీజేపీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్. ప్రస్తుతం హోం మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు సీఎంగా సమర్ధవంతంగా పని చేశారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఫడ్నవీస్ కు సామాజికవర్గం కూడా కలిసి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాకు నమ్మినబంటు. ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తే…డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. షిండేకు డిప్యూటీ సీఎంతో కీలకమైన హోం శాఖతో పాటు మరిన్ని శాఖలు కట్టబెట్టే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు షిండే అంగీకరిస్తారా ? లేదా అనేది తేలాల్సింది ఉంది. ఇప్పటికే రెండేళ్లకు పైగా షిండే సీఎంగా పని చేయడంతో…ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరే అవకాశం ఉంది. ఒక వేళ ఏక్ నాథ్ షిండే అంగీకరించకపోతే….రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకునేలా ప్రతిపాదిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

కూటమిలోని అగ్రనాయకులకు ఏ పదవులు దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫడ్నవీస్ సీఎం అయితే ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్…డిప్యూటీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. షిండే, అజిత్ పవార్ లకు కీలకమైన హోం, ఆర్థిక శాఖతో పాటు ఇరిగేషన్ శాఖ ఇచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి వర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తారన్న చర్చ నడుస్తోంది. మంగళవారం సాయంత్రం లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

మహారాష్ట్రలోనూ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన పరిస్థితులే…రిపీట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లేదు. ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే…మొత్తం సీట్లలో పది శాతం సీట్లను గెలవాల్సి ఉంటుంది. ఏపీలో వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో…ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇప్పుడు ఏ పార్టీకీ దక్కే అవకాశం లేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 29 స్థానాలు నెగ్గాలి. విపక్ష పార్టీల్లో ఏ పార్టీకి కూడా ఆ స్థాయిలో సీట్లు రాలేదు. మహా వికాస్ ఆఘాడీలోని శివసేన 20 సీట్లకే పరిమితం అయింది. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీలో…ప్రతిపక్ష పార్టీ అన్నదే లేకుండా కొనసాగనుంది.