Top story: శరద్ శకం ముగిసిందా…రాజకీయ నిరుద్యోగి పవార్

రాజకీయ చాణుక్యుడు.... 50ఏళ్ల పాటు మరాఠా రాజకీయాల్ని కనుసైగలతో శాసించిన కురువృద్ధుడు... అధికారాన్ని తన ఇంట్లో కట్టేసుకున్న శక్తిమంతుడు... కానీ పొలిటికల్ మారథాన్ చివరి మెట్టుపై బోల్తాపడి రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయాడు. ఆయనే శరద్ పవార్..

  • Written By:
  • Publish Date - November 28, 2024 / 12:46 PM IST

రాజకీయ చాణుక్యుడు…. 50ఏళ్ల పాటు మరాఠా రాజకీయాల్ని కనుసైగలతో శాసించిన కురువృద్ధుడు… అధికారాన్ని తన ఇంట్లో కట్టేసుకున్న శక్తిమంతుడు… కానీ పొలిటికల్ మారథాన్ చివరి మెట్టుపై బోల్తాపడి రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయాడు. ఆయనే శరద్ పవార్..

శరద్ పవార్… దేశ రాజకీయాల గురించి తెలిసిన వారెవరికైనా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు పవర్ కు కేరాఫ్ పవార్… నేడు పవర్ లెస్ పవార్… రాష్ట్రమంత్రి, నాలుగుసార్లు ముఖ్యమంత్రి, రెండుసార్లు కేంద్రమంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు, అంతర్జాతీయ క్రికెట్ సంఘం అధ్యక్షుడు… అబ్బో ఒకటా రెండా ఎన్నో పదవులు అధిష్ఠించాడు. సంకీర్ణశకంలో రాజకీయ చక్రం తిప్పాడు. ప్రధాని కావాలని కలలు కన్నాడు.. ఆ తర్వాత రాష్ట్రపతి రేసులోనూ నిలిచాడు… కానీ తాజా ఓటమితో రాజకీయ అంపశయ్యపై నిష్క్రమణ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ మరాఠా రాజకీయ యోధుడు. 84 ఏళ్ల పవార్ చివరి రోజుల్లో రాజకీయ నిరుద్యోగిగా మిగిలాడు.

పవార్ పుట్టింది ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో. విద్యార్థి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాడు. చిన్న వయసులోనే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. 27ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవార్ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. మోడీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే పవార్ పవర్ ఫుల్ లీడర్.. రాజకీయాన్ని నరనరానా జీర్ణించుకున్న పొలిటీషియన్. బలమైన ఉద్యమాల్ని నడిపినవాడు. అంతేనా కాంగ్రెస్ లాంటి పార్టీనే చీల్చి సొంత కుంపటి పెట్టుకున్నవాడు. తనను కాదన్న కాంగ్రెస్సే పెద్ద దిక్కులా ఉండాలని తనను బతిమిలాడేలా చేసుకున్న రాజకీయ మేథావి. ఆయన పేరులోనే పవర్, వార్ రెండూ ఉన్నాయి. రాజకీయ డక్కామొక్కీలు తిని ఎంతోమందిని తొక్కి పైకి వచ్చిన రాజకీయ చాణుక్యుడు. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసి ఇండీ కూటమిని ఏర్పాటు చేయడంలో శరద్ పవార్ ది కీలక పాత్ర. బీజేపీతో కలసిపోయిన శివసేనను వేరు చేసి తమవైపు తిప్పుకున్న తెలివితేటలు ఆయన సొంతం. కానీ అంతటి అపార అనుభవం కూడా మోడీ ముందు తలవంచక తప్పలేదు. రెక్కలు తెగిన పక్షిలా మారిపోయారు. మరింత బలంగా పుంజుకుని బంతిలా పైకి లేవడానికి ఆయనకు వయసులేదు.. ఒంట్లో శక్తీ లేదు..

ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతిని ఓడించి మహావికాస్ అఘాడీని అధికారంలోకి తీసుకురావాలని శరద్ పవార్ గట్టిగానే ప్రయత్నించారు. పక్షవాతం కారణంగా మాట సరిగా రాకపోయినా, ఒంట్లో సత్తువ లేకపోయినా పోరాటాన్ని మాత్రం వదల్లేదు. తనను కాదని వేరు కుంపటి పెట్టుకున్న తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ను ఓడించి అసరైన ఎన్సీపీ తనదేనని చెప్పుకోవాలని తెగ తపనపడ్డారు. కానీ తానోటి తలిస్తే మహారాష్ట్ర ఓటర్లు మరోటి తలచారు. అజిత్ ను గెలిపించి శరద్ పవార్ ను మహావికాస్ అఘాడీని ఘోరంగా తిరస్కరించారు. కూటమికి వచ్చింది 46 సీట్లు… అందులో శరద్ పవార్ కు వచ్చినవి కేవలం 10మాత్రమే. గత లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తన పక్షాన నిలవడంతో ఈసారీ తనదే గెలుపని భావించిన శరద్ పవార్ కు మహారాష్ట్రీయులు గట్టి షాకే ఇచ్చారు. 57 ఏడేళ్ల రాజకీయ జీవితంలో శరద్ పవార్ బారామతి నుంచే అసెంబ్లీకి, పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అది ఆయన కంచుకోట. కానీ ఇప్పుడు అది చేజారిపోయింది.

శరద్ పవార్ స్వయంకృతాపరాధమే ఆయన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే… ఆయన ఇలా అవమాన భారంతో అస్త్రసన్యాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ దశలో రాజకీయ వారసత్వాన్ని తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ కు ఇస్తారని అంతా భావించారు. అప్పటికే పార్టీపై అజిత్ గట్టి పట్టు తెచ్చుకున్నారు, బలమైన నేతగా ఎదిగారు. అయితే కుమార్తె సుప్రియాసూలెను రాజకీయంగా నిలబెట్టాలన్న తపనతో తప్పటడుగు వేశారు. సుప్రియా, అజిత్ పవార్ ల మధ్య సయోధ్య కుదిర్చి ఏదో ఓ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేశారు. దాని ఫలితమే అజిత్ పవార్ పార్టీని చీల్చడం. బీజేపీతో కలసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయారు అజిత్. పార్టీనే కాదు పార్టీ గుర్తును కూడా లాక్కుని పవార్ ను ఒంటరిని చేశారు. పాతకాలపు రాజకీయాన్ని నమ్ముకుని మళ్లీ సత్తా చాటుతానని భావించిన శరద్ కు చివరికి నిరాశే మిగిలింది. లోక్ సభ ఎన్నికలతో వచ్చిన ఉత్సాహాన్ని అసెంబ్లీ ఫలితాలు చంపేశాయి. మరో ఐదేళ్లు రాజకీయం చేయగల సత్తా ఆయనకు లేదు. వయసూ సహకరించదు. ఇక ఉన్న 10మంది ఎమ్మెల్యేలు ఎన్నాళ్లు తనతో ఉంటారో తెలియదు. నమ్మి నడిచే బలమైన నాయకులు లేరు…

శరద్ పవార్ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఏడాదితో ఆ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత మళ్లీ రాజ్యసభకు వెళ్లేంత బలం లేదు. వచ్చే ఎన్నికల్లో చూసుకోవచ్చనుకుంటే అప్పటికి 90 ఏళ్లు వచ్చేస్తాయి. కాబట్టి దీంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఈ ఓటమితో ఇంట్లో కూర్చోను మళ్లీ సత్తా చూపిస్తా అంటూ బీరాలు పలుకుతున్నారు పవార్. కానీ అది సాధ్యం కాదనీ ఆయనకూ తెలుసు… ఈ తరం దూకుడు రాజకీయాల ముందు గతతరం ఎత్తులు పనిచేయవని ఇప్పటికైనా గ్రహించాలి. రాజకీయాన్ని వదిలి జీవితపు చివరిమజిలీని ప్రశాంతంగా గడిపితే మంచిదన్నది రాజకీయ విశ్లేషకుల సూచన…