Top story : రెబెల్స్ చేతిలోకి సిరియా, 54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర

ఐదున్నర శతాబ్దాల కుటుంబ పాలన ముగిసింది. సిరియాలో తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు. అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ దేశం విడిచిపారిపోయారు. ప్రతిపక్షాలకు అధికారాన్ని బదిలీ చేస్తామని ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 02:39 PM IST

ఐదున్నర శతాబ్దాల కుటుంబ పాలన ముగిసింది. సిరియాలో తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు. అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ దేశం విడిచిపారిపోయారు. ప్రతిపక్షాలకు అధికారాన్ని బదిలీ చేస్తామని ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలీ వెల్లడించారు. దీంతో డమాస్కస్ కు వెలుగులు వచ్చాయని రెబెల్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

సిరియాలో అధ్యక్షుడు అల్ అసద్‌ శకం ముగిసింది. రాజధాని డమాస్కస్​ను తిరుగుబాటుదారులు అధీనంలోకి తీసుకున్నారు. దీంతో అసద్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అసద్ నిష్క్రమణతో సిరియాలో 54 ఏళ్ల…ఆయన కుటుంబ పాలనకు తెరపడినట్లయింది. బషర్‌ అసద్ తండ్రి హఫీజ్ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణించేంత వరకు…అంటే 2000 సంవత్సరం వరకు సిరియాను పాలించారు. ఆ తర్వాత అసద్ సిరియా పగ్గాలు అందుకున్నారు. తాజాగా తిరుగుబాటుదారులు డమస్కస్ ను అధీనంలోకి తీసుకోవడంతో… ఆదివారం తెల్లవారుజామున అసద్‌ దేశాన్ని విడిచి పారిపోయారు.

అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌…కుటుంబంతో పాటు ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్‌ కూల్చివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సిరియా తీరప్రాంతం వైపు పయనించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొద్దిసేపటికే యూటర్న్ తీసుకున్న విమానంతో రాడార్ లింక్ తెగిపోయాయి. రష్యా లేదా ఇరాన్ లో బషర్ అల్ అసద్ ఆశ్రయం పొందే అవకాశం ఉంది. మరోవైపు తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్‌ అల్‌-అసద్‌ సిరియాను వీడినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి సూచనలిచ్చినట్లు మాస్కో వెల్లడించింది.

అసద్ పాలన నుంచి డమస్కస్ విముక్తి పొందిందని సిరియా ప్రతిపక్ష నేతలు తెలిపారు. చీకటిపోయి వెలుగులు వచ్చాయని చెబుతుున్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మహమ్మద్ ఘాజీ జలాలీ తెలిపారు. దీంతో సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రెబల్స్‌ చెబుతున్నారు. డమస్కస్​లో తిరుగుబాటుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. గాల్లోకి తుపాకులు కాల్చి వేడుకలు చేసుకున్నారు. సెంట్రల్ స్క్వేర్స్‌ వద్ద అసద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారు హారన్లు మోగిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అసద్ నేరస్థుడని, నిరంకుశత్వం కలిగి వ్యక్తి అని నినాదాలతో హోరెత్తిస్తున్నారు. డమస్కస్​లో కాల్పుల జరపొద్దని తిరుగుబాటు దళం హయాత్‌ తహరీర్‌ అల్‌- షామ్‌ నేత అబూ మహమ్మద్ అల్ గోలానీ సూచించారు. ప్రభుత్వ సంస్థలను తమకు అధికారికంగా అప్పగించే వరకు ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని స్పష్టం చేశారు.

పదమూడేళ్ల అంతర్యుద్ధంలో అసద్‌ పైచేయి సాధించడంలో…రష్యా, ఇరాన్‌ కీలకపాత్ర పోషించాయి. అయితే ఈ సారి డమస్కస్‌కు అంతంతమాత్రంగానే సాయం అందించింది. రష్యా పరిమిత స్థాయిలోనే వైమానిక దాడులు నిర్వహించినా…రెబెల్స్ పై ప్రభావం చూపలేకపోయాయి. ఇజ్రాయెల్ దాడులతో దెబ్బ తిన్న ఇరాన్‌…అల్ అసద్ కు మునుపటి స్థాయిలో సహకారం అందించలేకపోయింది. దీంతో సిరియాపై హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు పట్టుబిగించాయి. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ పోయాయి. కీలక నగరం దారా నుంచి సిరియా సైన్యాలువైదొలగడంతో అది తిరుగుబాటుదారుల వశమైంది. 2011లో అసద్‌కు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే ఉద్యమం మొదలైంది. దారాలోని 90శాతం భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనారిటీ డ్రూజ్‌ తెగ మిలిటెంట్లు…డమస్కస్‌ ను ఆధీనంలోకి తీసుకున్నాయి.
—————